- విద్యా వ్యవస్థలో సమూల మార్పులు.
- వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు.. బ్లూ కాలర్ వైపు మొగ్గు చూపాలి.
- ప్రభుత్వ బడుల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రయోగాత్మక విద్యా బోధన.
- ఇబ్రహీంపట్నంలో పాఠశాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఇబ్రహీంపట్నం, మహా.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒక శక్తిమంతమైన సునామీలా ముంచుకొస్తోందని, ఈ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వైట్ కాలర్ ఉద్యోగాలకు ఏఐ వల్ల ముప్పు పొంచి ఉన్న తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడకుండా చూడాలంటే బ్లూ కాలర్ ఉద్యోగాలకు అనుగుణమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని ఆయన సూచించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో విద్యావేత్త, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి స్థాపించిన ‘ఏవీఎన్ లేక్ఫీల్డ్ గ్లోబల్ స్కూల్’ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సాహసోపేతమైన సంస్కరణలను వివరించారు.
ప్రభుత్వాలు విద్యపై భారీగా వెచ్చిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో నాణ్యత ఉండటం లేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడిలో ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ. 1.08 లక్షలు ఖర్చు చేస్తోందని, బడ్జెట్లో ఎనిమిది శాతానికి పైగా నిధులు కేటాయిస్తున్నా ఫలితాలు ఆశాజనకంగా లేవని పేర్కొన్నారు. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి కనీసం మూడో తరగతి పుస్తకాన్ని చదవలేకపోవడం దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రతి గ్రామంలోనూ బడి ఉన్నప్పటికీ నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు ఎక్కడ విఫలమవుతున్నాయో ప్రజాప్రతినిధులు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని వంద ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యా విధానాన్ని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలు విజయవంతం కావడానికి నర్సరీ, ఎల్ కేజీ వంటి పునాది తరగతులతో పాటు రవాణా సౌకర్యాలు కూడా ప్రధాన కారణమని గుర్తించామని, అందుకే ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులకు రవాణా సౌకర్యాలను కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వీటికి తోడు విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో పాఠశాలలను రేషనలైజేషన్ చేసి ప్రయోగాత్మకంగా మోడల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోని వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ముఖ్యమంత్రి వివరించారు. ఒక్కో పాఠశాలలో 2500 మందికి పైగా విద్యార్థులు చదువుకునేలా అత్యాధునిక వసతులతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని, ఇప్పటికే 59 పాఠశాలల పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ 2034లో భారతదేశంలో నిర్వహించబోయే ఒలింపిక్స్లో తెలంగాణ విద్యార్థులు బంగారు పతకాలు సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ప్రకటించారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డి.కె. అరుణ, వేం నరేందర్ రెడ్డి, రఘునందన్ రావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








