ఎస్ఎల్బీసీ పనులకు సరికొత్త ‘వడి’.
* 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం
హైదరాబాద్, మహా.
ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం దశాబ్దాల కల అయిన ఎస్ఎల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ) సొరంగం పనులను పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. పనుల్లో జాప్యాన్ని నివారించి, నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం, తవ్వకం వేగాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న పనుల కంటే రెట్టింపు వేగంతో, అంటే రోజుకు 10 నుంచి 14 మీటర్ల మేర సొరంగం తవ్వేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరికరాలను విదేశాల నుంచి అత్యంత వేగంగా తెప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రంగంలోకి దిగారు. మరో ఒకటి రెండు రోజుల్లో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పనుల వేగంపై కీలక దిశానిర్దేశం చేయనున్నారు.
గత ఏడాది ఫిబ్రవరిలో సంభవించిన ప్రమాదం కారణంగా ఎస్ఎల్బీసీ పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్పట్లో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) యంత్రం దెబ్బతినడంతో పనులు నిలిచిపోగా, ప్రస్తుత ప్రభుత్వం ఆ పాత పద్ధతికి స్వస్తి పలికి డీబీఎం (డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్) విధానాన్ని ఎంచుకుంది. గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భూగర్భంలో ఉండే ఫాల్టీ షియర్ జోన్లను గుర్తించేందుకు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) సహకారంతో హెలీ బోర్న్ సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగా సొరంగ మార్గంలో ఉన్న నాలుగు ప్రధాన షియర్ జోన్లను గుర్తించి, దానికి అనుగుణంగా తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం 43 కిలోమీటర్ల మేర ఉన్న ఈ సొరంగ మార్గంలో ఇంకా 9 కిలోమీటర్ల మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 17న పునఃప్రారంభమైన పనులు ప్రస్తుతం రెండు వైపులా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం కంటే కాస్త వెనక్కి వెళ్లి, ఎడమ వైపు నుంచి కొత్తగా సొరంగం తవ్వకం సాగిస్తున్నారు.
సొరంగం నిర్మాణ శైలిలోనూ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. గతంలో పది మీటర్ల వృత్తాకారంలో తవ్వకాలు జరపగా, ఇప్పుడు గుర్రపునాడ ఆకారంలో తొమ్మిది మీటర్ల మేర తవ్వుతున్నారు. ఆకారం మారినప్పటికీ నీటిని తరలించే సామర్థ్యంలో ఎలాంటి తగ్గుదల ఉండదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పనుల వేగాన్ని పెంచే క్రమంలో గుత్తేదారులపై ఒత్తిడి పెంచుతున్న ప్రభుత్వం, విదేశాల నుంచి రావాల్సిన మరో 3, 4 ప్రత్యేక పరికరాలను త్వరగా రప్పించే ప్రయత్నంలో ఉంది. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక పర్యవేక్షక విభాగాన్ని ఏర్పాటు చేసి అడ్డంకులను తొలగిస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తికి గడువును 2028 జూన్ నాటికి నిర్దేశించుకున్న ప్రభుత్వం, ఆర్థికంగానూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎస్ఎల్బీసీ పనుల కోసం రూ. 800 కోట్లను కేటాయించింది. ముఖ్యమంత్రి నిర్వహించబోయే తాజా సమీక్షలో పనుల వేగాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై స్పష్టత రానుంది. ఏళ్ల తరబడి నానుతున్న ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, నల్గొండ జిల్లా ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా యంత్రాంగం కదులుతోంది. అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతుండటంతో ఎస్ఎల్బీసీ పనుల్లో కొత్త కదలిక కనిపిస్తోంది.








