ఆదిలాబాద్, మహా .
ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ సాకుతో పోలీసులు భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత జోగు రామన్నను పోలీసులు అరెస్ట్ చేయడంతో గులాబీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేడు జరగనున్న నేపథ్యంలో, పార్టీ తరపున పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న జోగు రామన్నను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. మరోవైపు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, బీఆర్ఎస్ శ్రేణుల నుంచి నిరసన సెగ తగలకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి కీలక నేతల వరకు అందరినీ ఇళ్ల వద్దే నిర్బంధించడం లేదా పోలీస్ స్టేషన్లకు తరలించడం వంటి చర్యలతో జిల్లాలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపించే వాతావరణం కనిపిస్తోంది.
తన అరెస్టుపై మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోంశాఖను తన వద్దే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసులను అడ్డం పెట్టుకుని విపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ విజయం ఖాయమని తేలడంతో, ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను అధికార బలంతో అడ్డుకోవడం దుర్మార్గమని, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ప్రస్తుతం ఖానాపూర్ పట్టణంతో పాటు జిల్లా కేంద్రంలోనూ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను రంగంలోకి దించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, పోలీసుల మోహరింపుతో ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం రాజకీయ ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది.








