Mahaa Daily Exclusive

  మున్సిపల్ పీఠాల పోరు..! ఒకచోట పీక్స్‌కు చేరిన ఉత్కంఠ..!

Share

  • మున్సిపల్ పీఠాల పోరు.
  • రెండింటిలో విపక్షాల జైత్రయాత్ర.
  •  ఒకచోట పీక్స్‌కు చేరిన ఉత్కంఠ!

హైదరాబాద్: మహా.

తెలంగాణ పురపాలక రాజకీయాల్లో నెలన్నర కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల పర్వం శనివారం హైడ్రామా మధ్య ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటికీ.. కోర్టు కేసులు, క్యాంపు రాజకీయాలు, కిడ్నాప్‌లు, కౌన్సిలర్ల బేరసారాలతో నిలిచిపోయిన ఈ మూడు పురపాలికల్లో శనివారం ఎన్నిక నిర్వహించారు. ఇందులో రెండు చోట్ల అధికార కాంగ్రెస్‌కు చుక్కెదురు కాగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ విభిన్న సమీకరణలతో పీఠాలను దక్కించుకుంది. అయితే ఖానాపూర్‌లో మాత్రం ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎన్నిక ఆదివారానికి వాయిదా పడటం గమనార్హం.

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్-సీపీఐ కూటమి తన పట్టు నిలుపుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పార్టీ వెనక్కి తగ్గింది. మొత్తం 13 మంది సభ్యుల మద్దతు అవసరమైన చోట, బీఆర్ఎస్-సీపీఐ కూటమికి 14 మంది సభ్యుల బలం ఉండటంతో విజయం సునాయాసమైంది. చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ గుడిసెల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా సీపీఐకి చెందిన సరిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎక్స్‌అఫిషియో ఓట్లతో కలిపి 10 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్, గెలిచే అవకాశం లేదని భావించి ఈ ప్రక్రియకు దూరంగా ఉండిపోయింది. దీంతో గొడవలు లేకుండానే ఇక్కడ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.

ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. అధికార కాంగ్రెస్‌ను నిలువరించేందుకు బద్ధశత్రువులైన బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలపడం విశేషం. ఈ అరుదైన కలయికతో ఇబ్రహీంపట్నం పీఠం విపక్షాల వశమైంది. మున్సిపల్ చైర్మన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికవగా, వైస్ చైర్‌పర్సన్ పదవిని మిత్రపక్షంగా వ్యవహరించిన బీజేపీ అభ్యర్థి శ్యామల దక్కించుకున్నారు. రాష్ట్ర స్థాయిలో రాజకీయ వైరం ఉన్నప్పటికీ, స్థానిక సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు ఏకం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో మాత్రం పరిస్థితి రణరంగాన్ని తలపించింది. ఇక్కడ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సమయం నుంచి ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. మెజారిటీ కోసం ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం కాగా.. బీజేపీ అభ్యర్థి మౌనికకు ఏడుగురు, కాంగ్రెస్ అభ్యర్థి సత్యంకు ఏడుగురు సభ్యులు మద్దతు ప్రకటించారు. ఇరువర్గాల బలం సమానంగా ఉండటంతో గందరగోళం నెలకొంది. తమకే మెజారిటీ ఉందని ఇరుపక్షాలు వాదనకు దిగడంతో ఉద్రిక్తత పెరిగింది. ఈ క్రమంలో అధికారులు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బొజ్జుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదించి, ఎన్నికను ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరిలోనే ఎన్నికలు పూర్తయినా.. ఈ మూడు చోట్ల నెలన్నర పాటు సాగిన నిరీక్షణకు నేడు పాక్షికంగా తెరపడింది. క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నంలో గులాబీ జెండా ఎగిరినప్పటికీ.. ఖానాపూర్‌లో మాత్రం ఆదివారం ఏం జరుగుతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. అక్కడ బలం సమంగా ఉండటంతో టాస్ వేస్తారా లేదా ఎక్స్‌అఫిషియో ఓట్ల వినియోగంలో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటాయా అన్నది వేచి చూడాలి. మొత్తానికి నెలన్నర కాలంగా సాగుతున్న ఈ మున్సిపల్ ‘సస్పెన్స్ థ్రిల్లర్’ పతాక స్థాయికి చేరుకుంది.

Latest