- ఫీజు రీయింబర్స్‌మెంట్ అటకెక్కింది.. పేద విద్యార్థుల జీవితాలతో రేవంత్ చెలగాటం!
- తెలంగాణ సంపద పరాయి రాష్ట్రాల పాలు.
- రేవంత్ సర్కార్‌పై ఎంపీ ఈటల సంచలన ఆరోపణలు
హైదరాబాద్: మహా.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, రాష్ట్ర సంపదను కొళ్లగొడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రిని నిలదీశారు. తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఖర్చుల కోసం ఇక్కడి నిధులను మళ్లించడం దారుణమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తున్నారని ఈటల సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్నికల సమయంలో ‘ఆరు గ్యారెంటీలు – 66 హామీలు’ అంటూ నమ్మబలికిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ప్రజలను నట్టేట ముంచిందని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. గంపెడు ఆశలతో ప్రజలు కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెడితే, చట్టసభల్లో ప్రజా సమస్యల గురించి చర్చించాల్సింది పోయి, కేవలం వ్యక్తిగత దూషణలకే కాలం వృథా చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థపై ప్రభుత్వం చూపుతున్న వివక్షను ఆయన ఎండగట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బకాయి పెడితే, దానిని చెల్లించాల్సిన బాధ్యత కలిగిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నర ఏళ్లలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో పేద విద్యార్థుల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి నెలకొందని, రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘నేను చేసి చూపిస్తా’ అంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆ హామీలను ఎలా అమలు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని ఈటల ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు కావడం లేదని, కానీ పథకాలన్నీ అమలవుతున్నట్లు రంగుల ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. వీటితో పాటు భూముల వ్యవహారంలోనూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి తన అనుయాయులతో కలిసి ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా కట్టబెడుతున్నారని, భూ దందాలకు తెరలేపారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని ఈటల రాజేందర్ హెచ్చరించారు. విమర్శలకే పరిమితం కాకుండా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో బీజేపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.







