- రూ.225 కోట్లతో సరస్వతీ ఆలయ పునర్నిర్మాణం.
- ఆలయాల చెంత రాజకీయాలకు ‘నో’.
- తిరుమల తరహా నిబంధనలపై సీఎం రేవంత్ కీలక ఆదేశం.
- 6న బాసరకు ముఖ్యమంత్రి.. అద్భుత మాస్టర్ ప్లాన్‌కు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్.
హైదరాబాద్, మహా.
ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతీ ఆలయాన్ని అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యాచరణకు సిద్ధమైంది. ఆలయ అభివృద్ధిపై శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాసర క్షేత్ర రూపురేఖలను మార్చేలా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కు ఆమోదముద్ర వేశారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్ర నిబంధనలకు లోబడి ఆలయ అభివృద్ధి పనులు ఉండాలని అధికారులను ఆదేశించారు. రాబోయే దశాబ్దాల కాలాన్ని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు, అత్యాధునిక సౌకర్యాలతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని స్పష్టం చేశారు. బాసర ఆలయ పవిత్రతను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
ఆలయ పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సూచించిన సీఎం, అక్కడ కేవలం ఈవీ (ఎలక్ట్రిక్) వాహనాలను మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బాసరతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావు లేకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేవాలయాలు కేవలం భక్తి పారవశ్యానికి నిలయాలుగా ఉండాలని, అక్కడ రాజకీయ జెండాలకు, ప్రచారాలకు చోటు ఉండకూడదని స్పష్టం చేశారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే ఏ చర్యలనైనా ఉపేక్షించేది లేదని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
ఈ ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులకు ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.225 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా బాసర క్షేత్రం సరికొత్త రూపును సంతరించుకోనుంది. భక్తులకు అవసరమైన వసతి సౌకర్యాలు, క్యూలైన్ల ఆధునీకరణ, పరిసరాల సుందరీకరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో అధికార యంత్రాంగం బాసరలో ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దశాబ్దాలుగా నిరాదరణకు గురైన బాసర ఆలయం, రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకోనుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







