Mahaa Daily Exclusive

  ఆదిలాబాద్‌కు అభివృద్ధి ‘వరం’..! బోథ్‌లో రూ.1200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు సీఎం శంకుస్థాపన..

Share

  •  బాసర క్షేత్రానికి రూ.300 కోట్లు.. జిల్లాకు వేల కోట్ల ప్రాజెక్టులు!
  •  కుంభమేళా తరహాలో బాసర పుష్కరాల ఏర్పాట్లు.
  •  బోథ్‌లో రూ.1200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు సీఎం శంకుస్థాపన.

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాపై వరాల జల్లు కురిపించేందుకు సిద్ధమైంది. అక్షరాలకు నిలయమైన బాసర పుణ్యక్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు, జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు భారీ ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఆయన బాసర ఆలయ అభివృద్ధి కోసం రూ.300 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేయనుండటం జిల్లా వాసుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ ప్రతిష్టాత్మక పనులపై ఇప్పటికే శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, ఆలయ మాస్టర్ ప్లాన్‌కు తుది రూపునిచ్చారు.

బాసర ఆలయ పర్యటనకు ముందే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాసర క్షేత్రాన్ని కేవలం అభివృద్ధి చేయడమే కాకుండా, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రూ.500 కోట్లతో ఉత్తరాది కుంభమేళా తరహాలో అద్భుతమైన వసతులు కల్పించనున్నట్లు ప్రకటించారు. భక్తులకు కనీవినీ ఎరుగని రీతిలో సౌకర్యాలు కల్పించి, బాసర ఖ్యాతిని దేశవ్యాప్తం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడుగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్యా వ్యవస్థ బలోపేతానికి మరో రూ.600 కోట్లు కేటాయించబోతున్నట్లు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఈ నిధులు వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ బోథ్ నియోజకవర్గంలో రూ.1200 కోట్లతో భారీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఒకే గొడుగు కింద అందించేలా ఈ పాఠశాలను తీర్చిదిద్దనున్నారు. అనంతరం ఉట్నూరు మండలం పీపీ గ్రామంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ వేదికపై నుంచి మహిళా శక్తికి దన్నుగా నిలుస్తూ స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ చెక్కులను పంపిణీ చేయడంతో పాటు, క్రీడాకారులకు సీఎం కప్ అవార్డులను అందజేయనున్నారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన గ్రామ పంచాయతీలకు ఐఎస్ఓ సర్టిఫికేషన్లను ప్రదానం చేయనున్నారు. మొత్తానికి సీఎం పర్యటనతో ఆదిలాబాద్ జిల్లాలో వేల కోట్ల అభివృద్ధి పనులు పట్టాలెక్కబోతుండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.