- కర్నూలులో వివాహేతర సంబంధం కోసం భర్త దారుణ హత్య!
- గొంతు కోసి.. పెట్రోల్ పోసి.. ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసిన ఇల్లాలు!
- పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన దారుణ నిజాలు!
కర్నూలు,మహా.
కట్టుకున్న భార్యే కరడుగట్టిన నేరస్తురాలిగా మారి, భర్తను దారుణంగా అంతం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించింది. తనను ఇంటి మహాలక్ష్మిగా భావించి, అపారంగా ప్రేమించిన భర్తను తన వివాహేతర సంబంధానికి అడ్డంకిగా మారుతున్నాడన్న కారణంతో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి అత్యంత క్రూరంగా హత్య చేసింది. నిందితురాలు పద్మ, ఆమె ప్రియుడు వంశీని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. తొమ్మిదేళ్ల క్రితం పులి నరేంద్రకు పద్మతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కష్టపడి పనిచేసే స్వభావం గల నరేంద్ర, తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అయితే, గత ఏడాది పద్మకు వంశీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. నరేంద్ర పనికి వెళ్ళిన సమయంలో వంశీ తరచూ పద్మ ఇంటికి వచ్చేవాడు. ఈ విషయాన్ని గమనించిన పిల్లలు తండ్రికి చెప్పడంతో నరేంద్ర తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు నిర్వహించినప్పటికీ, పద్మ తన ప్రవర్తన మార్చుకోలేదు. ఒక దశలో ఆమె విడాకులు కోరుతూ నోటీసులు ఇచ్చి పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ, పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర ఆమెను ప్రాధేయపడి తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు.
నరేంద్ర తనను నమ్మి తిరిగి ఇంటికి తీసుకురావడాన్నే పద్మ అదునుగా భావించింది. మార్చి 22వ తేదీ రాత్రి నరేంద్ర నిద్రపోతున్న సమయంలో ఆమె తన ప్రియుడు వంశీకి సమాచారం అందించింది. పక్కా ప్రణాళిక ప్రకారం ఇంటికి వచ్చిన వంశీ, నరేంద్ర ప్రతిఘటించకుండా చేతులు కట్టేశాడు. ఆ వెంటనే పద్మ తన భర్త గొంతు కోసి ప్రాణాలు తీసింది. అనంతరం మృతదేహాన్ని ఆటోలో ఎక్కించి బైపాస్ రోడ్డుకు తరలించారు. అక్కడ శవాన్ని గుర్తించకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి దహనం చేశారు. మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియనట్లుగా పద్మ తన అత్తగారికి ఫోన్ చేసి, నరేంద్ర ఫోన్ ఇంట్లోనే మరిచిపోయి వెళ్ళాడని, ఇంటికి వచ్చాడా అని వాకబు చేస్తూ నటనకు తెరలేపింది.
అనుమానం వచ్చిన పోలీసులు నరేంద్ర కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్ డేటా, లొకేషన్ వివరాలను విశ్లేషించగా పద్మ మరియు వంశీ మధ్య జరిగిన సంభాషణలు, వారి కదలికలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. కట్టుకున్న భర్తను అడ్డంగా తొలగించుకోవాలనే పద్మ రాక్షస బుద్ధికి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించి తదుపరి చర్యలు చేపడుతున్నారు.








