Mahaa Daily Exclusive

  సింగరేణి కార్మికులకు ‘బీమా’ భరోసా..! యాజమాన్యం ప్రత్యేక చొరవతో కార్మిక కుటుంబాలకు కొండంత అండ..

Share

  • సహజ మరణానికీ రూ.10 లక్షల ఉచిత బీమా వర్తింపు.
  •  యూనియన్‌ బ్యాంక్‌తో ఒప్పందం.. ఈ నెల 1 నుంచే అమలు.
  • యాజమాన్యం ప్రత్యేక చొరవతో కార్మిక కుటుంబాలకు కొండంత అండ.

హైదరాబాద్,మహా.

నల్లబంగారు క్షేత్రంలో నిరంతరం శ్రమిస్తూ దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికుల జీవితాల్లో మరో శుభోదయం ఆవిష్కృతమైంది. విధి నిర్వహణలో ప్రమాదాలకు గురైనప్పుడు మాత్రమే కాకుండా, సాధారణంగా మరణించినా సరే ఆ కార్మిక కుటుంబం వీధిన పడకూడదనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం అద్భుతమైన బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ప్రత్యేక ఒప్పందం మేరకు, ఇకపై సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు లేదా అధికారులు సహజ మరణం పొందితే వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందనుంది. ఈ పథకం ఈ నెల 1వ తేదీ నుంచే అమల్లోకి రావడంతో కార్మిక శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా బయట మార్కెట్‌లో రూ.10 లక్షల బీమా రక్షణ పొందాలంటే నెలకు వేల రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) గౌతమ్ పోట్రు యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు సఫలమవడంతో, ఒక్క పైసా ప్రీమియం భారం లేకుండానే ఈ సౌకర్యం కార్మికులకు లభించింది. యూనియన్ బ్యాంకులో ‘కార్పొరేట్ శాలరీ అకౌంట్’ కలిగిన ప్రతి ఉద్యోగికి ఈ బీమా రక్షణ స్వయంచాలకంగా వర్తిస్తుంది. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అమలులోకి వచ్చిన రూ.1 కోటి ప్రమాద బీమా పథకానికి ఇది అదనపు ప్రయోజనంగా చేరడం విశేషం.

దురదృష్టవశాత్తు కుటుంబ యజమానిని కోల్పోయిన సమయంలో ఆర్థికంగా చితికిపోకుండా ఈ పది లక్షల రూపాయల సాయం ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తుందని కార్మిక సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 40 వేల మందికి పైగా కార్మికులకు ఈ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరనుంది. కేవలం ప్రమాదాలకే పరిమితం కాకుండా, అనారోగ్యం లేదా ఇతర సహజ కారణాలతో మరణించినా బీమా వర్తింపజేయాలన్న యాజమాన్యం ఆలోచన ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం కార్పొరేట్ ఖాతాదారులుగా ఉన్న సింగరేణియులకు ఈ మేలు చేకూర్చడం పట్ల అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.