Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ అరాచకాలపై ప్రజా విజయం..! రేవంత్ సర్కారు విధ్వంసానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి… కేటీఆర్..

Share

  •  మంచిర్యాల, రంగారెడ్డి జిల్లాల్లో గులాబీ జెండా రెపరెపలు.
  •  కౌన్సిలర్ల మొక్కవోని దీక్షకు కేటీఆర్ ‘సెల్యూట్’.
  •  రేవంత్ సర్కారు విధ్వంసానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి… కేటీఆర్.

 

హైదరాబాద్, మహా.

అధికార మదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా, ప్రలోభాలకు గురిచేసినా చివరకు ప్రజాస్వామ్యమే గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన అభ్యర్థులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అద్భుత విజయం కోసం క్షేత్రస్థాయిలో శక్తివంచన లేకుండా కృషి చేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డిలను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని పార్టీ పట్ల విధేయతను చాటుకున్న ప్రతి నాయకుడిని ఆయన కొనియాడారు.

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అవలంబించిన అప్రజాస్వామిక విధానాలను కేటీఆర్ తీవ్రంగా ఎండగట్టారు. అడ్డదారుల్లో అధికార పీఠాలను దక్కించుకోవడానికి అధికార పక్షం కౌన్సిలర్లపై రకరకాల ఒత్తిళ్లు తెచ్చిందని, అనేక రకాల ప్రలోభాలకు గురిచేసిందని మండిపడ్డారు. అయినప్పటికీ, బెదిరింపులకు లొంగకుండా, మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్సిలర్ల ధైర్యసాహసాలకు ఆయన ‘సెల్యూట్’ చేశారు. ముఖ్యంగా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మిత్రపక్షమైన సీపీఐ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా ప్రదర్శించిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై అణచివేతకు, అవినీతికి తావులేదని ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధిని విస్మరించి, రాష్ట్రాన్ని విధ్వంసం వైపు తీసుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని విశ్లేషించారు. అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను విధ్వంసం చేస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పే వరకు విశ్రమించబోమని, ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Latest