Mahaa Daily Exclusive

  చెరువుల చెంత ‘హైడ్రా’ గర్జన..! రెండు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం..

Share

  •  ఆక్రమణలపై ఉక్కుపాదం!
  •  ప్రభుత్వ భూమి అంగుళం వదిలే ప్రసక్తే లేదు.
  •  కమిషనర్ రంగనాథ్.
  •  తమ్మిడికుంట ఇక ‘ఒత్తిడి’ని దూరం చేసే పర్యాటక కేంద్రం.
  •  రెండు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.

మాదాపూర్, మహా.

నగరంలోని చెరువుల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను కాపాడటమే కాకుండా, వాటిని ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే అద్భుతమైన పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మాదాపూర్‌లోని తమ్మిడికుంట, సున్నం చెరువులను సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అకస్మికంగా తమ్మిడికుంటను సందర్శించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా చెరువుల సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులకు, స్థానికులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేలా తమ్మిడికుంటను ఒక మోడల్ పర్యాటక కేంద్రంగా మార్చాలని, అక్కడ అడుగుపెడితేనే మనసు ప్రశాంతంగా మారేలా ఏర్పాట్లు ఉండాలని కమిషనర్ దిశానిర్దేశం చేశారు.

చెరువుల అభివృద్ధిలో ప్రధాన అడ్డంకిగా మారిన ఆక్రమణలపై రంగనాథ్ కఠినంగా వ్యవహరించారు. సున్నం చెరువు పరిధిలోని సర్వే నంబర్ 30, 31లలో ఉన్న ప్రభుత్వ భూమి వివరాలను క్షుణ్ణంగా సేకరించి, అంగుళం భూమి కూడా పరాయి పాలు కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమణదారులు చూపించే పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, తప్పుడు క్లెయిమ్‌లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ్మిడికుంట చెరువు పైభాగంలో చెత్త, వ్యర్థాలను వేయడం వల్ల నీరు కలుషితమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్, చెరువుల సుందరీకరణలో పచ్చదనానికి పెద్దపీట వేయాలన్నారు. బయటి ఉష్ణోగ్రత కంటే చెరువు చెంత 3 నుంచి 4 డిగ్రీల వేడి తక్కువగా ఉండేలా పచ్చిక బయళ్లు, దట్టమైన మొక్కల పెంపకం చేపట్టాలని, సందర్శకుల కోసం పాత్ వేలు, సీటింగ్ వ్యవస్థను అత్యాధునికంగా నిర్మించాలని చెప్పారు.

మరోవైపు సున్నం చెరువు పరిసరాల్లోని వరద కాలువ సమస్యపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. బోరబండ, ఎన్ఆర్ఆర్ పురం బస్తీల నుంచి వచ్చే మురుగు నీరు, వరద నీరు నేరుగా చెరువులోకి కలవకుండా డైవర్షన్ కాలువ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పైపులైన్ల అనుసంధానం జరగకపోవడం వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించిన ఆయన, రెండు రోజుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైటెన్షన్ విద్యుత్ తీగల కింద ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించి, రోడ్డు విస్తరణ పనులకు మార్గం సుగమం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండు నెలల గడువులోగా చెరువులన్నీ కొత్త కళను సంతరించుకోవాలని, ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడవద్దని రంగనాథ్ తేల్చి చెప్పారు.

Latest