- ప్రజాస్వామ్య రక్షణకు కదలండి!
- అవినీతిపై ప్రజా పోరాటాలే ఏకైక మార్గం.
- డాక్టర్ కే. నారాయణ.
- హైదరాబాద్‌లో ‘ఇంటింటికీ సీపీఐ’ హోరు.. ప్రజల నుంచే వనరుల సేకరణ.
హైదరాబాద్ ,మహా.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని, అడుగడుగునా అవినీతి మయమై ప్రజాస్వామ్యానికే పెను ముప్పుగా పరిణమించిందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే. నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లో నిర్వహించిన ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతిని తుదముట్టించాలంటే ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి క్షేత్రస్థాయిలో పోరాటాలు నిర్వహించడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ అవినీతి వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ, వారిని చైతన్య పరిచి ప్రజా ఉద్యమాల వైపు నడిపించేందుకే ఈ ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.
ముఖ్యంగా దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ ఒక రకమైన భయాందోళనలకు గురవుతున్నారని నారాయణ విమర్శించారు. ఈ భయం వల్ల ఇతర రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కూడా జనం వెనకాడుతున్నారని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సీపీఐ నేరుగా ప్రజల వద్దకే వెళ్తోందని చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న జాతీయ, అంతర్జాతీయ సమస్యలను ప్రజలకు వివరిస్తూనే, ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఆర్థిక వనరులను కూడా ప్రజల నుంచే సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజల మద్దతుతోనే ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయడం సాధ్యమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు శ్రేణులు ప్రతి గడపకూ వెళ్లి ప్రజా సమస్యలపై గళమెత్తాలని, అవినీతి ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని ఆయన ఉద్బోధించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి. నరసింహా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. ఛాయాదేవి తదితరులు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి. స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ ఈ పోరాటంలో కార్మిక వర్గం పాత్రను వివరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు బి. వెంకటేశం, ఎం. నర్సింహా, చంద్రమౌళి, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ఎన్. శ్రీకాంత్, జిల్లా కౌన్సిల్ సభ్యులు చెట్టుకింద శ్రీనివాస్, అటుకుల రాజు, లక్ష్మి, మదన్ సింగ్, కిష్టమ్మ, కళ్యాణ్, అనిల్, సుశాంత్, మనోజ్, భాను తదితర ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హిమాయత్‌నగర్ వీధుల్లో ఎర్రజెండాల రెపరెపల మధ్య సాగిన ఈ ప్రదర్శన స్థానికులను విశేషంగా ఆకర్షించింది.







