Mahaa Daily Exclusive

  అడవి బాట వీడి.. కన్నతల్లి ఒడికి..! రాజకీయాల్లోకి రాను.. అనుమతిస్తే సామాజిక సేవ చేస్తా: మాజీ అగ్రనేత..

Share

  •  46 ఏళ్ల తర్వాత మంథని గడ్డపై మల్లా రాజిరెడ్డి అడుగు.
  •  బంధుమిత్రులతో ఆత్మీయ పలకరింపులు.. పాత జ్ఞాపకాల నెమరువేత.
  •  రాజకీయాల్లోకి రాను.. అనుమతిస్తే సామాజిక సేవ చేస్తా: మాజీ అగ్రనేత.

మంథని, మహా.

నాలుగు దశాబ్దాలకు పైగా విప్లవ పంథాలో సాగిన ఆయన ప్రస్థానం ఇప్పుడు ప్రశాంతమైన జనజీవన స్రవంతి వైపు మళ్లింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన తర్వాత శనివారం తొలిసారిగా తన స్వగ్రామమైన పెద్డపల్లి జిల్లా మంథనికి చేరుకున్నారు. సుమారు 46 ఏళ్ల క్రితం కన్నవారిని, కట్టుకున్న ఊరిని వీడి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, ఇన్నాళ్లకు తిరిగి రావడంతో మంథని వీధులన్నీ భావోద్వేగంతో నిండిపోయాయి. తన చిన్ననాటి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులను కలుసుకున్న సమయంలో రాజిరెడ్డి కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి. వీధిలో కనిపించిన ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆయన గడిపిన సమయం అందరినీ కదిలించింది.

ఈ సందర్భంగా గ్రామస్తులతో ముచ్చటించిన రాజిరెడ్డి తన సుదీర్ఘ ప్రయాణంలోని మలుపులను గుర్తు చేసుకున్నారు. దాదాపు 46 ఏళ్ల క్రితం తాను ఊరు విడిచానని, ఆ తర్వాత 1999 జనవరిలో ఒక్కసారి మాత్రం ఎవరికీ తెలియకుండా రాత్రివేళ వచ్చి వెళ్లానని ఆయన వెల్లడించారు. అప్పట్లో చీకట్లో వచ్చి వెళ్లడం వల్ల గ్రామాభివృద్ధిని, మార్పులను చూసే అవకాశం దక్కలేదని, ఇన్నాళ్లకు మళ్లీ తన ఊరిని నిండుగా చూసుకుంటున్నానని ఆవేదన నిండిన గొంతుతో చెప్పారు. ఊరి రూపురేఖలు మారిపోయాయని, చాలా మంది ఆత్మీయులు ఇప్పుడు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తన జీవితంలో అత్యధిక భాగం అడవిలోనే గడిచిపోయిందని, ఇప్పుడు శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఏమాత్రం లేదని రాజిరెడ్డి స్పష్టం చేశారు. కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పారు. అయితే, తన అనుభవంతో సమాజానికి ఏదైనా మేలు చేయాలని ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇస్తే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటానని వెల్లడించారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఆకాంక్షించారు. ఒకప్పటి సాయుధ దళాల నేతగా వెలుగు వెలిగిన రాజిరెడ్డి, ఇప్పుడు సాధారణ వ్యక్తిగా తన ఊరి ప్రజల మధ్య కూర్చుని సరదాగా కబుర్లు చెబుతుండటం చూసి మంథని ప్రజలు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.