- అంటరానితనంపై జస్టిస్ నాగరత్న భావోద్వేగపూరిత స్పందన.
- శబరిమల రివ్యూ పిటిషన్లపై 9 మంది సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభం.
- ఆర్టికల్ 17 పరిధిపై కేంద్రం అభ్యంతరం.. మహిళా న్యాయమూర్తి పదునైన ప్రశ్నలు.
ఢిల్లీ, మహా .
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం మంగళవారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ అంశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు 9 మంది సభ్యుల విస్తృత ధర్మాసనం, మతపరమైన ఆచారాలు మరియు రాజ్యాంగబద్ధమైన హక్కుల మధ్య ఉన్న సన్నని గీతపై లోతైన విశ్లేషణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనంలోని ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న చేసిన వ్యాఖ్యలు కోర్టు హాల్‌లోనే కాకుండా యావత్ దేశంలోనూ చర్చనీయాంశంగా మారాయి. “ఒక మహిళగా చెబుతున్నాను.. ఒక నెలలో మూడు రోజుల పాటు మహిళలకు అంటరానితనం ఉండి, నాలుగో రోజు అది మాయమవుతుందని అనుకోవడానికి వీల్లేదు” అంటూ ఆమె చేసిన పదునైన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని ‘అంటరానితనం నిర్మూలన’ (ఆర్టికల్ 17) ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేశాయి.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఎదుట కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ, 2018 నాటి తీర్పులో మహిళల ప్రవేశాన్ని నిరోధించడాన్ని అంటరానితనంతో పోల్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఒక నిర్దిష్ట వయస్సు గల మహిళలను మాత్రమే నియంత్రించడం వివక్ష కాదని, దానిని ఆర్టికల్ 17 కిందకు తీసుకురావడం సరికాదని ఆయన వాదించారు. దీనిపై జస్టిస్ నాగరత్న స్పందిస్తూ, అంటరానితనం అనేది కేవలం కుల ప్రాతిపదికన మాత్రమే కాకుండా, శారీరక ధర్మాల ఆధారంగా మహిళల పట్ల ప్రదర్శించే వివక్షకు కూడా వర్తిస్తుందని పరోక్షంగా సూచించారు. అంటరానితనానికి అడ్డుకట్ట వేయడానికే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆర్టికల్ 17ను ప్రాథమిక హక్కుగా చేర్చారని, దానిని కాలానికి అనుగుణంగా చూడాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయస్సున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని 2018లో అప్పటి ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజారిటీతో రద్దు చేసిన విషయం విదితమే. శతాబ్దాల నాటి ఈ సంప్రదాయం రాజ్యాంగ విరుద్ధమని నాటి తీర్పులో పేర్కొన్నప్పటికీ, దానిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా సుమారు 60కి పైగా రివ్యూ పిటిషన్లు దాఖలు కావడంతో, అత్యున్నత న్యాయస్థానం ఈ వివాదాన్ని 9 మంది సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ తుది విచారణలో కేవలం శబరిమల మాత్రమే కాకుండా, మసీదుల్లో మహిళల ప్రవేశం, పార్సీ మహిళల హక్కులు వంటి విస్తృత అంశాలను కూడా ధర్మాసనం పరిశీలిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తన లిఖితపూర్వక వాదనల్లో శబరిమల ఆచారాలను సమర్థిస్తూ, మతపరమైన అంశాల్లో న్యాయస్థానాల జోక్యం పరిమితంగా ఉండాలని కోరింది. హిందూ మతంలోని వైవిధ్యతను, ఒక సంప్రదాయంగా వస్తున్న ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. అయితే, రాజ్యాంగ నైతికత, మత స్వేచ్ఛ మధ్య సమతుల్యతను ఎలా పాటించాలన్నదే ఇప్పుడు ధర్మాసనం ముందున్న అతిపెద్ద సవాలు. జస్టిస్ నాగరత్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఈ కేసులో ఆర్టికల్ 17 అప్లికేషన్ అనేది అత్యంత కీలకమైన మలుపుగా మారనుంది. ఈ విచారణ ఏప్రిల్ 22 నాటికి ముగిసే అవకాశం ఉందని, ఆ తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు భారత సామాజిక , మతపరమైన హక్కుల చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించబోతోందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.








