Mahaa Daily Exclusive

  రిటైర్మెంట్‌ ఫలాల కోసం ‘కక్కుర్తి’.. ఏసీబీ వలలో ఇన్‌ఛార్జి ఎంఈఓ..!

Share

  •  ఏసీబీ వలలో ఇన్‌ఛార్జి ఎంఈఓ!
  •  మానుకోట జిల్లా గూడూరులో అవినీతి వేట.
  •  50 వేలు డిమాండ్‌.. 15 వేలు తీసుకుంటూ దొరికిన రవికుమార్‌.

మహబూబాబాద్, మహా.

విద్యాబుద్ధులు నేర్పే స్థానంలో ఉండి, తోటి ఉపాధ్యాయుడి పదవీ విరమణ ప్రయోజనాల కోసం లంచం డిమాండ్ చేసిన ఒక అధికారి ఏసీబీ పంజాకు చిక్కారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల ఇన్‌ఛార్జి ఎంఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న జింజీరాల రవికుమార్, బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్ పత్రాలపై సంతకం చేసేందుకు ఆయన పెట్టిన షరతు, చివరికి ఆయననే కటకటాల వెనక్కి నెట్టింది.

వివరాల్లోకి వెళ్తే.. గూడూరు మండలానికి చెందిన రవీందర్ అనే ఉపాధ్యాయుడు ఇటీవల పదవీ విరమణ పొందారు. తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ (పదవీ విరమణ ప్రయోజనాల)కు సంబంధించిన దస్త్రాలను పరిశీలించి, వాటిని తదుపరి ప్రక్రియ కోసం పంపాల్సి ఉండగా, ఇన్‌ఛార్జి ఎంఈఓగా ఉన్న రవికుమార్ వాటిని పెండింగ్‌లో పెట్టారు. ఆ పత్రాలపై సంతకం చేయాలంటే తనకు రూ. 50,000 లంచం ఇవ్వాలని ఆయన ఉపాధ్యాయుడిని డిమాండ్ చేశారు. జీవితాంతం పనిచేసి, రిటైర్మెంట్ సమయంలో రావాల్సిన నగదు కోసం కూడా లంచం ఇవ్వాల్సి రావడంతో విసిగిపోయిన రవీందర్, అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు.

బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో వల పన్నారు. బుధవారం ఉదయం రవీందర్ నుంచి లంచం సొమ్ములో భాగంగా తొలి విడతగా రూ. 15,000 తీసుకుంటుండగా గూడూరులోని ఎంఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. నగదు తీసుకుంటుండగా రవికుమార్‌ను పట్టుకున్న అధికారులు, ఆయన చేతి వేళ్లకు రసాయన పరీక్షలు నిర్వహించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

రవికుమార్ కేవలం ఇన్‌ఛార్జి ఎంఈఓగానే కాకుండా, హెడ్మాస్టర్‌గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. తోటి ఉపాధ్యాయుడి పట్ల ఇలాంటి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించి, లంచం కోసం వేధించడం జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ అధికారులు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. విరమణ పొందిన ఉద్యోగుల హక్కులను కాలరాయాలని చూసినా, ఇతర పనుల కోసం లంచం డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఇన్‌ఛార్జి ఎంఈఓ అరెస్టుతో గూడూరు మండలంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

Latest