- వ్యూహాత్మక వంతెనలు, చమురు టెర్మినళ్లు లక్ష్యంగా క్షిపణి ప్రయోగాలు..
- 48 గంటల పాటు భారతీయులకు అత్యవసర హెచ్చరిక.
ఢిల్లీ, మహా.
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మిన్నంటాయి. ఇరాన్‌లోని కీలక రవాణా వ్యవస్థ, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు మంగళవారం భారీ ఎత్తున దాడులకు తెగబడ్డాయి. ఆ దేశంలోని ప్రధాన రైల్వే మార్గాలు, వంతెనలు, రహదారులను ధ్వంసం చేయడం ద్వారా ఇరాన్ సైనిక కదలికలను స్తంభింపజేయడమే లక్ష్యంగా ఈ ఉమ్మడి ఆపరేషన్ కొనసాగింది. జంజాన్, కరాజ్, కాషాన్, తబ్రిజ్ వంటి కీలక నగరాల్లోని రైల్వే నెట్‌వర్క్ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. అమెరికా వైమానిక దళంతో కలిసి ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడులతో ఇరాన్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తన ఆయుధ సామాగ్రిని, సైనిక దళాలను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించకుండా అడ్డుకోవడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు. అమీనాబాద్‌లోని జంజాన్-మియానెహ్ మధ్య ఉన్న ప్రధాన రైల్వే వంతెనతో పాటు కరాజ్‌లోని చార్ బాగ్ కూడలి వద్ద రైల్వే లైన్లను క్షిపణులు తునాతునకలు చేశాయి. కాషాన్ సమీపంలోని యహ్యాబాద్ వంతెనపై జరిగిన దాడిలో ఇద్దరు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. హష్ట్రూడ్-తబ్రిజ్ మధ్య ఉన్న రైల్వే వంతెన కూడా పేకమేడలా కూలిపోయింది. కేవలం రైల్వే మార్గాలే కాకుండా, టెహ్రాన్-తబ్రిజ్ మధ్య ఉన్న ఫ్రీవేపై కూడా దాడులు జరగడంతో ప్రధాన రహదారులన్నీ మూతపడ్డాయి.
ఈ దాడుల్లో ఇరాన్ ఆర్థిక మూలమైన చమురు రంగానికి భారీ విఘాతం కలిగింది. ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం వాటా కలిగిన ఖర్గ్ ద్వీపంపై ఇజ్రాయెల్ వైమానిక దళం అత్యంత శక్తిమంతమైన దాడులు నిర్వహించింది. చమురు టెర్మినళ్లే లక్ష్యంగా సాగిన ఈ దాడులతో ఆ దేశ చమురు రవాణా దాదాపుగా నిలిచిపోయింది. దాడులకు ముందే ఇజ్రాయెల్ అక్కడి పౌరులను హెచ్చరించినప్పటికీ, ఆయుధ రవాణాకు వినియోగిస్తున్న రవాణా మార్గాలనే తాము లక్ష్యంగా చేసుకున్నామని స్పష్టం చేసింది. ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలన్నీ ప్రస్తుతం దాడుల నీడలో ఉండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విదేశీ వ్యవహారాల శాఖ తాజాగా ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర అడ్వైజరీని జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు భారతీయులు ఎక్కడి వారు అక్కడే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, నివాసాల నుంచి బయటకు రావద్దని కోరింది. ఎలాంటి సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు లేదా రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన ప్రాంతాల దరిదాపుల్లోకి వెళ్లవద్దని ప్రభుత్వం ఖరాకండిగా పేర్కొంది. ఇప్పటికే దేశం విడిచి వచ్చేయాలని గతంలోనే సూచించిన ప్రభుత్వం, తాజా దాడుల నేపథ్యంలో పౌరులు రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని హెచ్చరించింది. పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో పౌరుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది.







