- పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు.
- 15 రోజుల్లో సమస్యల పరిష్కారం.
- సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాటి పనితీరులో తలెత్తిన అన్ని రకాల సమస్యలను రాబోయే రెండు వారాల్లోగా పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ (ఏజీ) ఆర్. వెంకటరమణి ధర్మాసనానికి హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లలో నిఘా కెమెరాలు పనిచేయకపోవడంపై దాఖలైన పలు పిటిషన్లతో పాటు, అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించిన కేసును మంగళవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా అటార్నీ జనరల్ మాట్లాడుతూ.. సీసీటీవీల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించామని కోర్టుకు వివరించారు. ఈ అంశంపై మరింత స్పష్టత కోసం అమికస్ క్యూరీతో పాటు కేంద్ర హోం శాఖ కార్యదర్శితో స్వయంగా వరుస సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఈ విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు.
ఉభయ పక్షాల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. ఆలోగా ఈ ప్రక్రియపై తాజా స్థితిగతులతో కూడిన నివేదికను (స్టేటస్ రిపోర్ట్) సమర్పించాలని అమికస్ క్యూరీని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయవచ్చని సూచించింది. కాగా, భవిష్యత్తులో జరిగే విచారణలకు హోం శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, ప్రత్యేకంగా అవసరమని భావిస్తే తప్ప మినహాయింపు ఇస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.








