- బేగంపేట ఏవికన్స్ సంస్థలో దారుణం.
- ఏడాది కాలంగా లైంగిక దాడి.. వీడియోలతో బ్లాక్‌మెయిల్.
- పైశాచికానికి బలైపోయిన బాధితురాలి ఆశలు.. కటకటాల్లోకి కేరళకు చెందిన నసిముద్దీన్?.
హైదరాబాద్,మహా.
ఆకాశంలో విహరించాలని, పైలట్‌గా సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందాలని ఎన్నో ఆశలతో వచ్చిన ఒక యువతి కలలను ఆమెకు పాఠాలు నేర్పాల్సిన గురువే చిదిమేశాడు. బేగంపేటలోని ‘ఏవికన్స్ పైలెట్ శిక్షణ సంస్థ’లో వెలుగుచూసిన ఈ అమానవీయ ఘటన ఏవియేషన్ రంగంలో పెను సంచలనం సృష్టించింది. శిక్షణ పేరుతో దగ్గరై, లొంగదీసుకొని, గత ఏడాది కాలంగా సదరు యువతిపై నిరంతరం అత్యాచారానికి పాల్పడుతున్న ఉదంతం బాధితురాలి ఫిర్యాదుతో బయటపడింది. విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలకు చేర్చాల్సిన ఇన్‌స్ట్రక్టరే కీచకుడిగా మారి, ఆమె జీవితాన్ని నరకప్రాయం చేయడంతో ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన నసిముద్దీన్ అనే వ్యక్తి బేగంపేటలోని ఏవికన్స్ పైలెట్ శిక్షణ సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే సంస్థలో పైలట్ కోర్సు నేర్చుకుంటున్న ఒక యువతిపై అతడు కన్నేశాడు. 2025 జనవరి నుంచి ఆమెకు శిక్షణ ఇచ్చే నెపంతో మానసిక ఒత్తిడికి గురిచేస్తూ, అవకాశాన్ని చూసుకొని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా, ఆ అఘాయిత్యాలను తన సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డు చేశాడు. అప్పటి నుంచి ఆ దృశ్యాలను చూపిస్తూ ఆమెను నిరంతరం బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. నోరు విప్పితే ఈ వీడియోలను బహిర్గతం చేస్తానని, కెరీర్ నాశనం చేస్తానని బెదిరిస్తూ పలుమార్లు తన వాంఛను తీర్చుకున్నాడు.
నమ్మిన సంస్థలోనే తోటి సిబ్బంది నుంచి ఇలాంటి వేధింపులు ఎదురుకావడంతో బాధితురాలు తీవ్ర మానసిక క్షోభకు గురైంది. శిక్షణ పేరుతో మొదలైన ఈ నరకం రోజురోజుకూ మితిమీరిపోవడంతో, ఇక భరించలేక ఆమె ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. నసిముద్దీన్ తనపై చేసిన దారుణాలను, వీడియోలతో తనను ఎలా వేధిస్తున్నాడో వివరించి ఫిర్యాదు చేసింది. పైలట్ కావాలన్న తన ఆశయానికి ఈ ఘటన పెద్ద ఆటంకంగా మారిందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.
బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనపై ప్రాథమిక సమాచారం సేకరించి, నిందితుడు నసిముద్దీన్‌పై అత్యాచారం, బెదిరింపులు, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పైలట్ శిక్షణ వంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత, క్రమశిక్షణ ఉండే చోట ఇలాంటి దారుణాలు జరగడంపై ఏవియేషన్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకొని, అతడి వద్ద ఉన్న వీడియోలు, ఫొటోలను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనతో ఏవికన్స్ సంస్థలోని ఇతర విద్యార్థినులు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. ఒక యువతి భవిష్యత్తుతో చలగాటం ఆడిన నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు స్పష్టం చేశారు.








