Mahaa Daily Exclusive

  నల్లాలకు మోటార్లు బిగిస్తే ఉచ్చు..! ఎస్‌.ఆర్‌. నగర్‌లో జలమండలి విజిలెన్స్‌ మెరుపు దాడులు..

Share

  • ఎస్‌.ఆర్‌. నగర్‌లో జలమండలి విజిలెన్స్‌ మెరుపు దాడులు.
  • అక్రమంగా నీటిని తోడితే జరిమానా తప్పదు.
  •  ఏడు మోటార్లు స్వాధీనం చేసుకున్న అధికారులు.
  • పక్కవారి గొంతు ఎండగట్టొద్దు.. తక్కువ ప్రెజర్ వస్తే 155313కు ఫిర్యాదు చేయండి.

హైదరాబాద్, మహా.

భాగ్యనగరవాసుల దాహార్తిని తీర్చేందుకు జలమండలి ఎంతో వ్యయప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి పైపులైన్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోంది. అయితే, కొంతమంది వినియోగదారులు స్వార్థంతో తమ నల్లాలకు అక్రమంగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్నారు. దీనివల్ల అదే లైన్లో ఉన్న ఇతర వినియోగదారులకు నీరు అందక, లో-ప్రెజర్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరిస్తున్న జలమండలి, తాజాగా అక్రమ మోటార్ల నియంత్రణకు విజిలెన్స్ దాడులను ముమ్మరం చేసింది.

బుధవారం ఎస్‌.ఆర్‌. నగర్‌ పరిధిలోని ఎస్‌ఆర్‌టీ కాలనీలో కొందరు వినియోగదారులు నిబంధనలకు విరుద్ధంగా నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్నట్లు స్థానికుల నుంచి అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే స్పందించిన ఓ అండ్‌ ఎం డివిజన్ నంబర్-6 అధికారులు, విజిలెన్స్ బృందంతో కలిసి ఆ ప్రాంతంలో మెరుపు తనిఖీలు చేపట్టారు. నీటి సరఫరా జరుగుతున్న సమయంలోనే ప్రతి ఇంటినీ నిశితంగా పరిశీలించిన అధికారులు, నేరుగా పైపులైన్లకు బిగించి ఉన్న ఏడు విద్యుత్ మోటార్లను గుర్తించి వాటిని అక్కడికక్కడే స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నీటిని తోడుతున్న వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.

జలమండలి నిబంధనల ప్రకారం నల్లాలకు మోటార్లు బిగించడం శిక్షార్హమైన నేరం. మొదటిసారి పట్టుబడితే మోటార్లను స్వాధీనం చేసుకుంటారని, రెండోసారి కూడా అదే తప్పు చేస్తూ పట్టుబడితే రూ. 5,000 జరిమానా విధించడంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేవలం తన స్వార్థం కోసం తోటి వినియోగదారుల హక్కులను కాలరాయడం సరికాదని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నారు. నగరవ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని విజిలెన్స్ విభాగం ప్రకటించింది.

వినియోగదారులకు ఒకవేళ తక్కువ ప్రెజర్ తో నీరు సరఫరా అయినా లేదా నీటి సరఫరాలో మరేదైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ పరిధిలోని మేనేజర్, డీజీఎం లేదా జీఎం అధికారులను సంప్రదించాలని అధికారులు సూచించారు. లేనిపక్షంలో జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అంతేకానీ నిబంధనలు ఉల్లంఘించి మోటార్లు బిగిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని జలమండలి యంత్రాంగం గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

Latest