Mahaa Daily Exclusive

  సముద్ర వేటపై 61 రోజుల నిషేధం ప్రారంభం: తీరానికి చేరిన వేలాది పడవలు.. ఎల్లుండి నుంచి ‘మత్స్యకార భరోసా’ సర్వే..

Share

  • సముద్ర వేటకు ‘విరామ’ గీతం.
  • తీరానికి చేరిన మరపడవలు.
  • జూన్‌ 14 వరకు నిషేధం అమలు.
  • ఎల్లుండి నుంచి మత్స్యకార భరోసా సర్వే.

కాకినాడ, మహా.
బంగాళాఖాతంలో మత్స్య సంపద పునరుత్పత్తి కాలం ప్రారంభం కావడంతో సముద్ర వేటపై వార్షిక నిషేధం అమల్లోకి వచ్చింది. చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి పిల్లలను చేసే ఈ సమయంలో వాటికి ఆటంకం కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా అమలు చేసే ఈ 61 రోజుల విరామ సమయం బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమై జూన్ 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు తమ పడవలతో తీరానికి చేరుకోవడంతో కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌ సహా తీర ప్రాంతాలన్నీ పడవల రాకతో కిక్కిరిసిపోయాయి. కాకినాడ తీరానికి ఇప్పటివరకు 392 మెకనైజ్డ్‌ బోట్లు, 3,993 మోటరైజ్డ్‌ పడవలు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న కాలంలో మత్స్యకారులు ఎవరూ నిబంధనలు ఉల్లంఘించి సముద్రంలోకి వెళ్లకుండా మత్స్యశాఖ అధికారులు, తీర రక్షణ దళం నిరంతర నిఘా ఏర్పాటు చేశాయి.
వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం అందించే ‘మత్స్యకార భరోసా’ పథకం అమలుపై యంత్రాంగం దృష్టి సారించింది. ఈ పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. మత్స్యశాఖ అధికారులు గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటిని సందర్శించి, బోటు యజమానులు మరియు ఆ పడవలపై వేటకు వెళ్లే మత్స్యకార కార్మికుల వివరాలను సేకరిస్తారు. పడవలకు సంబంధించిన లైసెన్సులు, రిజిస్ట్రేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఈ విరామ సమయంలో మత్స్యకారులు తమ వలలను శుభ్రం చేసుకోవడం, పడవలకు రంగులు వేయడం, ఇంజిన్ల మరమ్మతులు వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. వేట నిలిపివేత ప్రభావంతో మార్కెట్లలో చేపల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.