Mahaa Daily Exclusive

  డీలిమిటేషన్ రాష్ట్ర భవితకు గొడ్డలిపెట్టు: నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

Share

రాష్ట్ర భవితకు గొడ్డలిపెట్టు.
* డీలిమిటేషన్‌ను వ్యతిరేకించండి.
*ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ.

అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలని కోరుతూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా చేపట్టదలచిన ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తుందని, దీనిని ఒక అత్యవసర పరిస్థితిగా గుర్తించాలని ఆమె లేఖలో కోరారు. డీలిమిటేషన్ వల్ల రాష్ట్రం తన రాజకీయ స్వరాన్ని కోల్పోవడమే కాకుండా, వేల కోట్ల రూపాయల భవిష్యత్ ఆర్థిక అవకాశాలను కూడా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
దక్షిణ రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్రంగా అన్యాయం చేసే ఈ ప్రతిపాదిత డీలిమిటేషన్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బహిరంగంగా, స్పష్టంగా తన వ్యతిరేకతను తెలియజేయాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులను ఏకతాటిపైకి తీసుకువచ్చి, పార్లమెంటులో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాలనే తేడా లేకుండా అందరూ ఒకే మాటపై నిలబడాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.
రాష్ట్రం ఎదుర్కోబోతున్న ఈ గండంపై చర్చించేందుకు తక్షణమే ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని షర్మిల తన లేఖలో ప్రతిపాదించారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను తిరస్కరిస్తూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించి, దానిని అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సూచించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెరిగితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, ఇది సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆమె లేఖలో గుర్తు చేశారు.
ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదని, ప్రజల హక్కులను కాపాడే రాజ్యాంగ బాధ్యతగా గుర్తించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. భావితరాల భవితను గుర్తుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో గట్టిగా వ్యవహరించాలని కోరారు. ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతూ కేంద్రం తీసుకునే నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని షర్మిల తన లేఖలో స్పష్టం చేశారు.

Latest