Mahaa Daily Exclusive

  గుజరాత్‌లో దారుణం…..

Share

 

* మైనర్ బాలికపై మూడేళ్లుగా సామూహిక అత్యాచారం!

* ప్రేమ పేరుతో వల.. వీడియోలతో బ్లాక్‌మెయిల్.

* వెలుగులోకి పర్వేజ్ పఠాన్ గ్యాంగ్ కిరాతకం.

హైదరాబాద్, మహా.

 

సమాజం తలదించుకునే అత్యంత పాశవికమైన, దారుణమైన ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగుచూసింది. అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికపై కొందరు మృగాళ్లు ఏకంగా మూడేళ్ల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానుషత్వం స్థానికంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రేమ పేరుతో ఓ మృగాడు పన్నిన వలలో చిక్కుకున్న ఆ అమాయకపు బాలిక.. బ్లాక్‌మెయిల్ బారిన పడి ఆరుగురు మృగాళ్ల చేతిలో తన శరీరంతో పాటు ప్రాణాలను సైతం అరచేతిలో పెట్టుకుని బతికింది. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో వెలుగుచూసిన ఈ గ్యాంగ్ రేప్ కేసులో నివ్వెరపోయే నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పోలీసుల విచారణలో బయటపడుతున్నాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన తొమ్మిది మంది నిందితుల్లో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితులైన పర్వేజ్ పఠాన్ గ్యాంగ్ దారుణాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

పోలీసులు మరియు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘోర కలికి 2023వ సంవత్సరంలోనే బీజం పడింది. ప్రధాన నిందితుడు పర్వేజ్ పఠాన్ అనే యువకుడు ఆ మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని శారీరకంగా అనుభవించడమే కాకుండా, ఆ అకృత్యాలను రహస్యంగా తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. ఆ తర్వాత తన అసలు వికృత రూపాన్ని బయటపెట్టాడు. తాను తీసిన ఆ అసభ్యకరమైన వీడియోలను అడ్డం పెట్టుకుని బాలికను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన కోరిక తీర్చకపోతే ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో లీక్ చేసి పరువు తీస్తానని తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురిచేశాడు. పరువు పోతుందన్న భయంతో, సమాజానికి భయపడి ఆ మైనర్ బాలిక గుండెల్లోనే కుమిలిపోతూ ఆ కామాంధుడి రాక్షసత్వానికి బలైపోయింది.

పర్వేజ్ పఠాన్ వికృత చేష్టలు అంతటితో ఆగలేదు. ఆ బాలిక నిస్సహాయతను చూసి మరింత బరితెగించిన అతను, తన స్నేహితులను సైతం ఈ పాడుపనికి ఉసిగొల్పాడు. వీడియోలను ఆసరాగా చేసుకుని ఆరుగురు యువకులు ఆ బాలికను తమ కామవాంఛ తీర్చే యంత్రంలా వాడుకున్నారు. ఈ దారుణాన్ని బయటకు చెబితే కుటుంబ సభ్యులను సైతం దారుణంగా హత్య చేస్తామని వారు కత్తులతో బెదిరించినట్లు విచారణలో తేలింది. ఇలా ప్రాణభయంతో, పరువు పోతుందన్న ఆందోళనతో ఆ బాలిక 2023 నుంచి దాదాపు మూడు సంవత్సరాల పాటు వారికి బానిసలా నరకయాతన అనుభవించింది. రోజురోజుకూ నిందితుల పైశాచికత్వం శృతిమించడంతో.. ఇక భరించలేకపోయిన ఆ బాలిక ధైర్యం చేసి జరిగిన ఘోరాన్ని తన కుటుంబ సభ్యులకు కన్నీరుమున్నీరుగా వివరించింది. దీంతో ఆగ్రహోదగ్రులైన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, కేసు తీవ్రతను దృష్ట్యా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోక్సో చట్టంతో పాటు, సామూహిక అత్యాచారం, బెదిరింపులు తదితర అత్యంత కఠినమైన సెక్షన్ల కింద మొత్తం తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటికే ఎనిమిది మంది కామాంధులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మూడేళ్ల పాటు ఒక మైనర్ బాలికను ఇంత పాశవికంగా హింసించిన ఈ మృగాళ్లకు ఉరిశిక్ష వేయాలని స్థానికులు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, నిందితులకు కఠినాతి కఠినమైన శిక్ష పడేలా చూడాలని యావత్ దేశం ముక్తకంఠంతో కోరుతోంది.

Latest