Mahaa Daily Exclusive

  నిప్పుల కొలిమిలా తెలంగాణ…..

Share

 

* ఆసిఫాబాద్‌లో రికార్డు స్థాయిలో 45.6 డిగ్రీలు.

* రాష్ట్రంలో ఈ సీజన్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.

*ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలు.

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఎండాకాలం ఇంకా పూర్తి కాకముందే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. పగటిపూట వడగాలుల తీవ్రత కూడా తోడవడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారిపోయింది.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత కలవరపెడుతోంది. శనివారం నాడు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఎండలు రికార్డు స్థాయిలో మండిపోయాయి. అక్కడ ఏకంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ వేసవి సీజన్‌లో రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. ఆసిఫాబాద్‌తో పాటు నిజామాబాద్‌లో 45.5 డిగ్రీలు, నిర్మల్ , జగిత్యాల జిల్లాల్లో 44.4 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట జిల్లాల్లో కూడా 44.3 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆయా జిల్లాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం పది గంటలు దాటితే చాలు ప్రధాన రహదారులన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

ఇక రాష్ట్ర రాజధాని, విశ్వనగరం హైదరాబాద్‌లోనూ భానుడు భగభగమంటున్నాడు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శనివారం నాడు నగర పరిధిలోని సరూర్ నగర్ ప్రాంతంలో అత్యధికంగా 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంబర్‌పేటలో 42.0 డిగ్రీలు, హిమాయత్ నగర్‌లో 41.9 డిగ్రీలు నమోదు కాగా, మెహిదీపట్నం, కుత్బుల్లాపూర్, ఆసిఫ్ నగర్ ప్రాంతాల్లో 41.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నాగోల్ ప్రాంతంలో సైతం 41.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదు కావడంతో నగర వాసులు ఉక్కపోతతో విలవిలలాడుతున్నారు. పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు మరియు వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.