* ఆదాయం మనది, అనుభవం వారిదా!
*స్వయం సమృద్ధిలో సత్తా చాటుతున్న దక్షిణాది.
* అట్టడుగున యూపీ, బీహార్**
*రాబడిలో తెలంగాణ టాప్..
*ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకే రాజకీయ పెత్తనమా?.
హైదరాబాద్, మహా.
దేశ సమాఖ్య వ్యవస్థలో ఆర్థిక అసమానతలు, ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న తీవ్ర వివక్ష మరోసారి పచ్చిగా బట్టబయలైంది. రాష్ట్రాల మొత్తం ఆదాయంలో సొంత రాబడి (పన్నులు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం) వాటాపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) , 2025-26 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అంచనాల తాజా నివేదిక దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ‘ఆత్మనిర్భర్’ (స్వయం సమృద్ధి) సాధించడంలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుండగా, జనాభాలోనూ, విస్తీర్ణంలోనూ అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు దారుణంగా చతికిలపడ్డాయి. రేయింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్న దక్షిణాది రాష్ట్రాల నిధులతో, పాలిస్తున్న నేతల వైఫల్యాలతో కుదేలైన ఉత్తరాది రాష్ట్రాలకు దానధర్మాలు చేస్తున్నారన్న చేదు వాస్తవాన్ని ఈ తాజా గణాంకాలు కళ్లకు కడుతున్నాయి.
రాష్ట్రాల సొంత రాబడి గణాంకాలను పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాల పనితీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏకంగా 77.07 శాతం సొంత రాబడితో అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటింది. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక (76.79 శాతం), తమిళనాడు (75.31 శాతం), కేరళ (72.63 శాతం) రాష్ట్రాలు తమ ఆర్థిక పరిపుష్టిని నిరూపించుకున్నాయి. కానీ, డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ నిత్యం గొప్పలు చెప్పుకునే ఉత్తరప్రదేశ్ కేవలం 48.23 శాతం సొంత ఆదాయానికే పరిమితం కాగా, మధ్యప్రదేశ్ 44.88 శాతం, ఛత్తీస్‌గఢ్ 53.90 శాతంతో సరిపెట్టుకున్నాయి. ఇక బీహార్ పరిస్థితి మరీ దారుణంగా కేవలం 25.97 శాతంగా నమోదైంది. దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు 58.17 శాతంగా ఉంటే, ఈ ఉత్తరాది పెద్ద రాష్ట్రాలు కనీసం ఆ సగటును కూడా చేరుకోలేకపోవడం అక్కడి పాలకుల పరిపాలనా వైఫల్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
కొత్తగా ఏర్పడిన చిన్న రాష్ట్రాలు లేదా భౌగోళికంగా ప్రతికూల పరిస్థితులు ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకబడితే అర్థం చేసుకోవచ్చు. కానీ, అపారమైన వనరులు, భారీ జనాభా, విస్తారమైన భౌగోళిక ప్రాంతం ఉన్న యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇంత దారుణంగా వెనుకబడటం వెనుక అసలు కారణమేమిటన్నది ఇప్పుడు జాతీయ స్థాయిలో మేధావులను తొలిచేస్తున్న ప్రధాన ప్రశ్న. అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, మెరుగైన పాలన అందిస్తున్న రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా నిధులు ఇస్తుంటే.. ఆ కష్టార్జితాన్ని తీసుకెళ్లి పాలనాపరంగా విఫలమైన రాష్ట్రాలకు ఉచితాల రూపంలో పంచిపెట్టడం ఎంతవరకు సమంజసం అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఒక సమర్థవంతమైన సమాఖ్య వ్యవస్థలో పెద్ద రాష్ట్రాలన్నీ కనీసం 75 శాతం సొంత ఆదాయం తెచ్చుకునేలా, చిన్న రాష్ట్రాలు 50 శాతానికి పైగా వృద్ధి సాధించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అలా కాకుండా పనిచేసేవాడి దగ్గర లాక్కొని, పనిచేయని వాడికి పంచిపెట్టే ఈ వ్యవస్థ ఏమాత్రం స్థిరమైనది కాదని ఆర్థిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆర్థిక అసమానతల వెనుక ఒక భయంకరమైన రాజకీయ కుట్ర దాగి ఉందన్నది కాదనలేని కఠోర సత్యం. ఆర్థికంగా దివాళా తీసిన రాష్ట్రాల చేతిలో అత్యధిక రాజకీయ బలం ఉండటం ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోదీకి ఎంతో అనుకూలంగా మారింది. జనాభా నియంత్రణ పాటించని యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలకు భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ద్వారా మరింత మంది ఎంపీ సీట్లను కట్టబెట్టేందుకు కేంద్ర పెద్దలు పావులు కదుపుతున్నారు. సంపదను సృష్టిస్తున్న రాష్ట్రాల గొంతు నొక్కి, ఏమాత్రం అభివృద్ధి సాధించని రాష్ట్రాలకు రాజకీయ పెత్తనం అప్పగించడం దేశ ఐక్యతకే తీవ్ర ప్రమాదకరం. అందుకే, మెరుగైన పాలన అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించేలా తక్షణమే సరికొత్త ఆర్థిక, రాజకీయ అధికార పంపిణీ ఫార్ములాను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా జరగని పక్షంలో, భారతదేశ సమాఖ్య వ్యవస్థ పగుళ్లు దేరి, దేశం మరింత అధోగతి పాలయ్యే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.







