Mahaa Daily Exclusive

  వేగం కన్నా ప్రాణం మిన్న….

Share

* నెత్తురోడుతున్న రహదారులపై సర్కారు దిద్దుబాటు చర్యలు.
*ములుగు జిల్లాలో ‘అరైవ్ అలైవ్’ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిన మంత్రులు పొంగులేటి, సీతక్క.
*రాష్ట్రంలో రోజుకు 20 మంది బలి.
*వాహనదారుల నిర్లక్ష్యంపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆవేదన.
*ట్రాఫిక్ నిబంధనలు పాటించి క్షేమంగా ఇంటికి చేరాలని ప్రజలకు హితవు.
*ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం.
ములుగు,మహా.
పరిపాలనలో వేగం, పారదర్శకత తీసుకురావడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అట్టడుగు స్థాయి వరకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ పేరిట తెలంగాణ ప్రజాప్రభుత్వం అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేస్తూ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఇందులో ప్రధాన భాగంగా, నిత్యం నెత్తురోడుతున్న రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు ‘అరైవ్ అలైవ్’ పేరిట వారం రోజుల పాటు రోడ్డు భద్రత స్పెషల్ డ్రైవ్‌ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించనున్నారు.
ఈ బృహత్తర కార్యక్రమానికి ములుగు జిల్లా మేడారం సమీపంలోని జంగాలపల్లి వేదికగా అంకురార్పణ జరిగింది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఈ రోడ్డు భద్రతా ఉత్సవాలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ, మున్సిపల్ చైర్మన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్, జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పలువురు ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రహదారి భద్రత ప్రాముఖ్యతను వివరించే పలు కార్యక్రమాలను వారు స్వయంగా పర్యవేక్షించారు.
రోడ్డు ప్రమాదాల్లో జరుగుతున్న ప్రాణనష్టంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కొద్దిపాటి నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ఎందరో తమ ప్రాణాలను గాల్లో కలిపేసుకుంటున్నారని, వారి పొరపాట్ల వల్ల అమాయకులైన ఎదుటివారు సైతం బలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రతిరోజూ సగటున 20 మంది, ఏడాదికి ఏకంగా 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం పాలవుతున్నారని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏటా సుమారు లక్షా యాభై వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, లక్షలాది మంది తీవ్ర గాయాలతో శాశ్వత వైకల్యం బారిన పడుతున్నారని స్పష్టం చేశారు. ఒక్క ప్రమాదం జరిగితే ఆ కుటుంబం మొత్తం చెల్లాచెదురై, రోడ్డున పడుతున్న హృదయ విదారక ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నామని ఆయన ఆవేదన చెందారు.
మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా ఉండాలంటే పౌరుల్లో స్వచ్ఛందంగా మార్పు రావాల్సిన అవసరం ఉందని మంత్రి పొంగులేటి ఉద్ఘాటించారు. జీవితంలో ఏ గొప్ప లక్ష్యాన్ని సాధించాలన్నా ముందుగా మనం బతికి ఉండటం అత్యంత ప్రధానమన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడం, ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకమని ఆయన హెచ్చరించారు. వేగం కన్నా ప్రాణం చాలా విలువైందని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తూచా తప్పకుండా పాటించి క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.