*దక్షిణాదికి ఎలాంటి నష్టం లేదు.. ప్రాతినిధ్యం మరింత పెరుగుతుంది.
*సమాన దామాషా పద్ధతిలోనే లోక్‌సభ సీట్ల పెంపు.
*బిల్లులు ఆమోదం పొందితే 2029 నాటికే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.
*ప్రతిపక్షాల అపోహలకు చెక్ పెడుతూ పబ్లిక్ డొమైన్‌లోకి సమగ్ర సమాధానాలు.
హైదరాబాద్, మహా.
పార్లమెంటు వేదికగా ఇటీవల ప్రతిపక్షాల వ్యతిరేకతతో వీగిపోయిన కీలక బిల్లుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై పబ్లిక్ డొమైన్‌లో, ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో నెలకొన్న అపోహలు, సందేహాలను నివృత్తి చేస్తూ అధికారికంగా ఒక సమగ్ర ‘ఫ్రీక్వెంట్లీ ఆస్క్‌డ్ క్వశ్చన్స్’ (ఎఫ్‌ఏక్యూ) పత్రాన్ని విడుదల చేసింది. ఏప్రిల్ 16, 2026న లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లుల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను కేంద్రం ఇందులో అత్యంత స్పష్టంగా వివరించింది. కేవలం రాజకీయ స్వార్థంతో ప్రతిపక్షాలు సృష్టించిన భయాందోళనల్లో ఎలాంటి వాస్తవం లేదని ఈ పత్రం కుండబద్దలు కొట్టింది.
ముఖ్యంగా ఈ మూడు బిల్లులను ప్రస్తుత తరుణంలో ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందన్న దానిపై కేంద్రం పక్కా లాజిక్ తో సమాధానమిచ్చింది. ‘నారీ శక్తి వందన్ అధినియం’ కింద మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే, 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ పూర్తి కావాల్సి ఉంది. ఆ ప్రక్రియ కోసం ఎదురుచూస్తే 2029 సాధారణ ఎన్నికల నాటికి మహిళలకు రిజర్వేషన్లు దక్కే అవకాశం ఏమాత్రం లేదు. కాబట్టి, సగం జనాభాగా ఉన్న మహిళలకు తక్షణమే లబ్ధి చేకూర్చేందుకే ఈ నిబంధనను డీలింక్ చేస్తూ బిల్లులు తీసుకువచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. ఇక లోక్‌సభ స్థానాల గరిష్ట పరిమితిని 850కి ఎందుకు పెంచాల్సి వచ్చిందన్న ప్రశ్నకు సైతం పక్కా వివరణ ఇచ్చింది. 1976లో దేశ జనాభా 54 కోట్లు ఉన్నప్పుడు లోక్‌సభ సీట్ల సంఖ్యను 550గా నిర్ధారించారని, ప్రస్తుతం జనాభా 140 కోట్లకు చేరినందున, ప్రజలకు సరైన ప్రాతినిధ్యం దక్కాలంటే సీట్లను 850కి పెంచక తప్పదని తేల్చిచెప్పింది.
ఈ బిల్లుల వల్ల జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని కేంద్రం ఎఫ్‌ఏక్యూలో బలంగా తిప్పికొట్టింది. సీట్ల పెంపు అనేది ఒకే రకమైన ‘దామాషా విస్తరణ’ (ప్రపోర్షనల్ ఎక్స్‌పాన్షన్) పద్ధతిలో జరుగుతుందని, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమానంగా 50 శాతం మేర సీట్లు పెరుగుతాయని క్లారిటీ ఇచ్చింది. ఈ లెక్కన ప్రస్తుతమున్న 543 సీట్లు సుమారు 816కు పెరుగుతాయని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకపోగా, మరింత మెరుగుపడుతుందని గణాంకాలతో సహా నిరూపించింది. ప్రస్తుత లోక్‌సభలో 23.76 శాతంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, కొత్త బిల్లుల ప్రకారం 23.87 శాతానికి చేరుతుందని స్పష్టం చేసింది. సీట్ల పెంపుతో ఏపీకి 38, తెలంగాణకు 26, తమిళనాడుకు 59, కర్ణాటకకు 42, కేరళకు 30 చొప్పున లోక్‌సభ స్థానాలు దక్కుతాయని, జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని కేంద్రం నిస్సందేహంగా వెల్లడించింది.
ఇక డీలిమిటేషన్ కమిషన్ చట్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మార్చే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలను సైతం కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. కమిషన్ చట్టంలో ఎలాంటి మార్పులు ప్రతిపాదించలేదని, ప్రస్తుత చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే లోక్‌సభ స్థానాల విస్తరణ వల్ల ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు దక్కే రిజర్వ్‌డ్ సీట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని, తద్వారా చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం మరింత బలోపేతం అవుతుందని వివరించింది. కులగణనను ఆలస్యం చేసేందుకే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చారన్న వాదనలో ఎలాంటి పస లేదని కొట్టిపారేసింది. మొత్తంగా విపక్షాల కుతర్కాల వల్లే మహిళలకు తక్షణమే దక్కాల్సిన 33 శాతం రిజర్వేషన్ల ఆశలు ఆవిరయ్యాయన్న వాస్తవాన్ని కేంద్రం విడుదల చేసిన ఈ పత్రం ప్రజల కళ్లకు కట్టింది.







