Mahaa Daily Exclusive

  ఆపరేషన్ ఆక్టోపస్-2.0′ సక్సెస్…

Share

*దేశవ్యాప్తంగా భారీ సైబర్ నెట్‌వర్క్ గుట్టురట్టు.
* సైబర్ దొంగలతో కుమ్మక్కైన 32 మంది బ్యాంకు అధికారులు అరెస్ట్.
*9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల ఏకకాల దాడులు.
* మొత్తం 52 మంది నిందితుల పట్టివేత.
*రూ. 150 కోట్ల కుంభకోణం.. 850 కేసులతో లింకులు.
* విస్తుపోయే నిజాలు వెలుగులోకి.
* మ్యూల్ ఖాతాలతో సహకరించిన బ్యాంక్ సిబ్బంది.

హైదరాబాద్, మహా.

సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేసే దిశగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి సంచలన విజయాలు సాధించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్-2.0’ పేరుతో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక ఆపరేషన్‌లో సుమారు రూ. 150 కోట్ల మేర జరిగిన ఒక మహా సైబర్ కుంభకోణం గుట్టురట్టయింది. సామాన్యుల ఖాతాలకు రక్షణగా నిలవాల్సిన బ్యాంకు అధికారులే కాసులకు కక్కుర్తిపడి సైబర్ దొంగలతో చేతులు కలపడం దర్యాప్తులో విస్తుపోయేలా చేసింది. హైదరాబాద్ పోలీసులు మొత్తం 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి, 32 మంది బ్యాంకు అధికారులతో సహా మొత్తం 52 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 850కి పైగా సైబర్ మోసాల కేసులతో వీరికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు పోలీసులు బట్టబయలు చేశారు.
పెట్టుబడి స్కామ్‌లు, ట్రేడింగ్ మోసాలు, మరియు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో అమాయక ప్రజలను భయాందోళనలకు గురిచేసి భారీగా సొమ్ము దోచుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంక్ అధికారులే ప్రధాన లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది. అరెస్ట్ అయిన 52 మందిలో ఏకంగా 32 మంది బ్యాంకు అధికారులు ఉండటం ఈ స్కామ్ తీవ్రతను, బ్యాంకుల్లో నెలకొన్న భద్రతా లోపాలను తెలుపుతోంది. వీరితో పాటు 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు కూడా ఉన్నారు. సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కైన ఈ బ్యాంకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అమాయకుల సొమ్మును దారి మళ్లించేందుకు ఏకంగా 350 అక్రమ బ్యాంకు ఖాతాలను (మ్యూల్ అకౌంట్స్) పక్కా ప్రణాళికతో తెరిచి ఇచ్చారని దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి. అరవింద్ బాబు, ఏసీపీ ఆర్.జి. శివ మారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక పోలీసు బృందాలు ఈ ‘ఆపరేషన్ ఆక్టోపస్-2.0’లో పాల్గొన్నాయి. మొత్తం 7 రోజుల పాటు తొమ్మిది రాష్ట్రాల్లో అలుపెరగకుండా దాడులు నిర్వహించి ఈ భారీ నెట్‌వర్క్‌ను ఛేదించాయి. గత ఫిబ్రవరిలో నిర్వహించిన ‘ఆపరేషన్ ఆక్టోపస్-1’లో 16 రాష్ట్రాల నుంచి 117 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆపరేషన్‌లో వెలుగు చూసిన కీలక ఆధారాలతోనే ఇప్పుడు రెండో విడతగా దాడులు చేపట్టారు. ఖాతాదారుల భద్రతను గాలికొదిలి, నిబంధనలను తుంగలో తొక్కి దొంగలకు దారులు వేసిన బ్యాంకు అధికారుల పాత్రపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అధికారులు మరింత లోతైన విచారణ జరుపుతున్నారు.