* దృష్టికి వచ్చిన 3 గంటల్లో డిలీట్ చేయాల్సిందే.
* ఏఐ కంటెంట్‌కు లేబుల్ తప్పనిసరి.
* 11 వేలకు పైగా నకిలీ పోస్టులపై ఈసీ యాక్షన్.
* 100 నిమిషాల్లోనే కంప్లైంట్ క్లియర్..
* సీ-విజిల్ యాప్ ద్వారా 3 లక్షల ఫిర్యాదుల పరిష్కారం.
* ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పకడ్బందీ నిఘా.
హైదరాబాద్, మహా.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ (ఫేక్) కంటెంట్ కనిపిస్తే తమ దృష్టికి వచ్చిన కేవలం 3 గంటల్లోగా రాజకీయ పార్టీలు వాటిని వెంటనే తొలగించాలని ఈసీ కఠినంగా ఆదేశించింది. మార్చి 15న ఈ ఐదు చోట్లా ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ఉన్న 11 వేలకు పైగా ఫేక్ పోస్టులు, యూఆర్‌ఎల్‌లను గుర్తించి తొలగించినట్లు వెల్లడించింది. ఆయా ఫేక్ కంటెంట్‌లను పోస్ట్ చేసిన వారిపై పోలీసు స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేయించామని, బాధ్యుల నుంచి వివరణలు స్వీకరించామని స్పష్టం చేసింది.
**ఏఐ కంటెంట్‌కు లేబుల్స్ తప్పనిసరి**
సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఓటర్లను తప్పుదోవ పట్టించకుండా ఈసీ పకడ్బందీ చర్యలు చేపట్టింది. రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు తమ ప్రచారంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) జనరేటెడ్ కంటెంట్‌ను వాడితే, కచ్చితంగా దానికి ‘ఏఐ జనరేటెడ్’, ‘సింథటిక్ కంటెంట్’, ‘డిజిటల్లీ ఎన్‌హ్యాన్స్‌డ్’ లేదా ‘ఏఐ ఆల్టర్డ్ కంటెంట్’ అనే లేబుల్‌ను స్పష్టంగా జతచేయాలని తేల్చిచెప్పింది. దాంతో పాటు ఆ పోస్ట్ చేస్తున్న సంస్థ వివరాలను కూడా బహిర్గతం చేయాలని నిబంధన పెట్టింది. ఇక పోలింగ్ తేదీకి ముందు 48 గంటల పాటు కచ్చితంగా ‘సైలెన్స్ పీరియడ్’ (నిశ్శబ్ద కాలం) పాటించాలని, ఈ సమయంలో మీడియా, టీవీ ఛానళ్లు, రేడియోలు, వార్తాపత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని దిశానిర్దేశం చేసింది. ఐటీ చట్టం కింద నోటిఫై చేయబడిన ఐటీ నోడల్ అధికారులు ఈ పోస్టులను పర్యవేక్షిస్తున్నారని ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది.
**సీ-విజిల్ సక్సెస్.. 100 నిమిషాల్లో పరిష్కారం**
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు తీసుకొచ్చిన సీ-విజిల్ (C-Vigil) యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. మార్చి 15 నుంచి ఐదు రాష్ట్రాల్లో ఈ యాప్ ద్వారా వచ్చిన మొత్తం 3,10,393 ఫిర్యాదులను పరిష్కరించినట్లు ఈసీ ప్రకటించింది. అందులో దాదాపు 96.01 శాతం ఫిర్యాదులను, కంప్లైంట్ అందిన కేవలం 100 నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించడం విశేషం.
**ప్రధాని మోదీ ప్రసంగంపై సీపీఎం, సీపీఐ అభ్యంతరం**
మరోవైపు, లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై వామపక్షాలు (సీపీఎం, సీపీఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాయి. ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ అయిన ‘దూరదర్శన్’లో ప్రధాని ప్రసంగాన్ని ప్రసారం చేయడం.. తమిళనాడు, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఎన్నికల నియమావళిని (కోడ్) ఉల్లంఘించడమేనని ఆరోపించాయి. రాజకీయపరమైన సందేశాన్ని పంపేందుకు అధికార పక్షం ప్రభుత్వ మీడియా సంస్థను వాడుకోవడం స్వేచ్ఛా, పారదర్శక ఎన్నికల సూత్రాలకు విరుద్ధమని ఆ పార్టీలు ఆక్షేపించాయి.







