Mahaa Daily Exclusive

  కాంగ్రెస్‌లో నడిచేది “ఖాన్దాన్” రాజకీయాలే…

Share

* రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న ‘పిక్ పాకెటర్’.
*దక్షిణాదికి ఇండీ కూటమి తీరని ద్రోహం.
* బిల్లులు వీగిపోతే పైశాచిక సంబరాలు.
*పార్లమెంట్‌లో రాహుల్ వ్యవహారశైలి అత్యంత బాధ్యతారాహిత్యం.
*రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో విపక్షాలపై నిప్పులు చెరిగిన కేంద్రమంత్రి శోభా కరంద్లాజే.

హైదరాబాద్, మహా.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కాంగ్రెస్ హైకమాండ్‌ను సంతోషపెట్టడానికే ప్రధానమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమై రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న ఆయనొక “చీటర్”, “పిక్ పాకెటర్” అని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై, ఇండీ కూటమి ప్రగతి నిరోధక నైజంపై నిప్పులు చెరిగారు.
**అబద్ధపు హామీలతో దగా**
తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా వైఫల్యం చెందిందని ఆమె మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయం, విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు, నిరుద్యోగులకు భృతి, ఆసరా పెన్షన్ల పెంపు, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం వంటి భారీ హామీలు ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కదానినీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని విమర్శించారు.
**ఖాన్దాన్ (వారసత్వ) రాజకీయాలకే పెద్దపీట**
కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ప్రాధాన్యం అంటే అది కేవలం ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వంటి ఒకే కుటుంబానికి (ఖాన్దాన్) మాత్రమే పరిమితమని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో జార్కిహోళి కుమార్తెకు టికెట్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. దీనికి భిన్నంగా బీజేపీ మాత్రమే సామాన్య కుటుంబాలకు చెందిన మహిళలకు వారి ప్రతిభ ఆధారంగా అవకాశాలు కల్పిస్తోందని స్పష్టం చేశారు. మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించి నిర్ణయాత్మక ప్రక్రియలో భాగస్వాములను చేసినప్పుడే సమాజానికి న్యాయం జరుగుతుందన్నారు. ఇక పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ తీరు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందని, తనను తాను “జాదూగర్” (మాంత్రికుడు) అని సంబోధించుకుంటూ ఆయన అపరిపక్వంగా ప్రవర్తించారని విమర్శించారు.
**దక్షిణాదికి ద్రోహం.. బిల్లుల వైఫల్యంపై సంబరాలు**
ఏప్రిల్ 17వ తేదీ భారత మహిళల చరిత్రలో ఒక చీకటి రోజుగా (బ్లాక్ డే) మిగిలిపోయిందని కేంద్రమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఇండీ కూటమి దేశ మహిళలతో పాటు మొత్తం దక్షిణ భారతదేశాన్ని ఘోరంగా మోసం చేసిందని మండిపడ్డారు. జనాభా నియంత్రణ పాటిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు భవిష్యత్తులో అన్యాయం జరగకుండా ఉండేందుకే ప్రధాని మోదీ 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు, ప్రతి రాష్ట్రానికి 50 శాతం ఎంపీ సీట్లు పెంచేలా డీలిమిటేషన్ బిల్లు తెచ్చారని గుర్తుచేశారు. ఈ డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో ఎంపీ సీట్లు 17 నుండి 26కు, ఏపీలో 25 నుండి 38కి పెరుగుతాయని, కానీ ఈ ప్రయోజనాన్ని ఇండీ కూటమి అడ్డుకుందని ఆరోపించారు.
సరికొత్త బిల్లును తెచ్చేందుకు కేవలం ఒక గంట సమయం ఇస్తే ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో స్పష్టంగా ప్రతిపాదించినప్పటికీ విపక్షాలు తిరస్కరించాయన్నారు. పార్లమెంటులో బిల్లులు వీగిపోయినప్పుడు కాంగ్రెస్, ఇండీ అలయెన్స్ నాయకులు దేశ ప్రయోజనాలను గాలికొదిలి పండుగలా సంబరాలు చేసుకున్నారని, వారి నవ్వులు, హగ్‌లు దేశాన్ని ఉత్తర-దక్షిణంగా విభజించే కుట్రకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
**నరేంద్ర మోదీ పాలనలోనే మహిళా సాధికారత**
గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే మహిళా సాధికారతకు అసలైన పెద్దపీట పడిందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అటల్ బిహారీ వాజపేయి స్వయం సహాయక సంఘాల ఆలోచనను విస్తరించి, నేడు దేశంలో 3 కోట్లకు పైగా మహిళలను “లఖ్ పతి దీదీలు”గా తీర్చిదిద్దిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. మహిళల చేతిలో డబ్బు ఉంటే కుటుంబానికి, దేశానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే ముద్ర లోన్లలో 60 శాతానికి పైగా, ఎంఎస్ఎంఈ సబ్సిడీల్లో 53 శాతం మహిళలకే అందించామని గణాంకాలతో సహా వివరించారు. నేటి మహిళలు రక్షణ రంగంలో ఫైటర్ జెట్‌లు నడుపుతూ దేశానికి సేవ చేస్తున్నారని, అయినా రాజకీయాల్లో వారికి సరైన అవకాశాలు రాకుండా కాంగ్రెస్ లాంటి పార్టీలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. కర్ణాటకలోని ఒక నిరక్షరాస్యురాలైన గ్రామ పంచాయతీ అధ్యక్షురాలి సమర్థతను, కోస్టల్ ప్రాంత మత్స్యకార మహిళల జీవనశైలిని ఉదాహరణగా చూపుతూ.. ఆర్థిక శక్తి ఉంటే మహిళల నిర్ణయాధికారం ఎలా మారుతుందో ఆమె వివరించారు.
ఈ కీలక మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి, మీడియా ప్యానలిస్ట్ డా. ప్రభా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.