ప్రచార హోరులో కాస్త రిలాక్స్.
* బెంగాలీ ఫేమస్ స్నాక్ ‘ఝల్ మురి’ని ఆస్వాదించిన ప్రధాని మోదీ.
*ఝార్‌గ్రామ్‌లో సామాన్యుడిలా స్థానిక రుచుల ఆస్వాదన..
*మరోవైపు ప్రచారంలో తృణమూల్ టార్గెట్‌గా మోదీ సుడిగాలి పర్యటనలు.
*మహిళా రిజర్వేషన్లపై దీదీ సర్కారు ద్రోహం.
* ఓటుతో బుద్ధి చెప్పాలని బంకురా సభలో పిలుపు.
హైదరాబాద్, మహా.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హోరు తారాస్థాయికి చేరుకుంది. ఉక్కిరిబిక్కిరి చేసే అత్యంత బిజీ షెడ్యూల్ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాస్త విశ్రాంతి తీసుకున్నారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా నాలుగు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన.. ప్రయాణాల మధ్యలో ఝార్‌గ్రామ్ ప్రాంతంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన బెంగాల్ వాసుల అత్యంత ఆదరణ పొందిన స్పైసీ స్ట్రీట్ ఫుడ్ ‘ఝల్ మురి’ ని ఎంతో ఇష్టంగా ఆస్వాదించారు. ముర్మురాలు (మరమరాలు), సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, కాస్త ఘాటైన మసాలా కలిపి తయారు చేసే ఈ రుచికరమైన చిరుతిండిని ప్రధాని సాధారణ పౌరుడిలా ఆస్వాదించిన తీరు స్థానికులను ఆకట్టుకుంది.
ఈ ఆహ్లాదకరమైన క్షణాలకు సంబంధించిన ఫోటోను ప్రధాని మోదీ స్వయంగా తన సోషల్ మీడియా (ఎక్స్) ఖాతాలో పంచుకున్నారు. “ఆదివారం పశ్చిమ బెంగాల్‌లో వరుసగా నాలుగు ర్యాలీల మధ్య.. ఝార్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్ మురిని ఆస్వాదించాను” అంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు అంతర్జాలంలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒకవైపు పదునైన విమర్శలతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతూనే, మరోవైపు ఇలా స్థానిక సంస్కృతి, రుచులతో మమేకమవుతూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
**నిప్పులు చెరిగిన ప్రధాని.. మహిళల పట్ల టీఎంసీ కుట్రలు**
చిరుతిండి విరామం అనంతరం రాజకీయ ప్రచారంలోకి దిగిన ప్రధాని మోదీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ , ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. బంకురాలో నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. బెంగాల్ మహిళలను టీఎంసీ మరోసారి దారుణంగా వంచించిందని దుయ్యబట్టారు. చట్టసభల్లో తమకు దక్కాల్సిన 33 శాతం రిజర్వేషన్లు రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికల నాటికే అమల్లోకి రావాలని రాష్ట్ర మహిళలు బలంగా ఆకాంక్షించారని ఆయన గుర్తుచేశారు. కానీ, ఆ ప్రతిష్టాత్మక మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి టీఎంసీ కుటిల ప్రయత్నాలు చేసిందని ఆయన మండిపడ్డారు.
బెంగాల్ ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో చట్టసభలకు ఎన్నికై ఎమ్మెల్యేలు, ఎంపీలుగా రాణించడం టీఎంసీ అధినాయకత్వానికి ఏమాత్రం ఇష్టం లేదని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళా సాధికారతకు అడ్డుపడుతూ, వారి అవకాశాలకు గండికొడుతున్న ఇలాంటి పార్టీకి రాబోయే ఎన్నికల్లో ‘ఓటు’ అనే ప్రజాస్వామ్య ఆయుధంతో గట్టి శిక్ష వేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ‘డూ ఆర్ డై’ అన్నట్లుగా సాగుతున్న బెంగాల్ పోరులో ప్రధాని పర్యటన రాజకీయ కాకను మరింత పెంచింది.







