* అకాల వర్షాలకు తీవ్ర పంట నష్టం.
* వడగండ్ల వానల బీభత్సం..నేలకొరిగిన వరి.
* ఇంకా ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు.
నిజామాబాద్, మహా.
చేతికొచ్చిన పంట కళ్లముందే నీటిపాలవడంతో కన్నీరుమున్నీరవుతున్న అన్నదాతలు
నిజామాబాద్ రూరల్ పరిధిలో భారీగా నష్టం.. ఆదుకోవాలని రైతుల వేడుకోలు
ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి పగబట్టింది. నిజామాబాద్ జిల్లాలో వడగండ్లతో కూడిన అకాల వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచేశాయి. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో గాలివాన సృష్టించిన బీభత్సంతో రైతులు తీవ్ర కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
నియోజకవర్గంలోని ఇందల్ వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం విరుచుకుపడింది. ఈదురు గాలుల తీవ్రతకు కోత దశకు వచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది. వందలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట కళ్లముందే నాశనం కావడంతో అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. వరితో పాటు మొక్కజొన్న, మామిడి రైతులు కూడా ఈ వడగండ్ల వానకు భారీగా నష్టపోయినట్లు ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి.
కొనుగోలు కేంద్రాలు లేక కన్నీటి కడలు..
రైతుల పాలిట అకాల వర్షం ఒక శాపంగా మారితే, అధికారుల ముందస్తు ప్రణాళికా లోపం మరో అశనిపాతంగా మారింది. ప్రభుత్వం ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ప్రారంభించకపోవడం రైతుల పాలిట ప్రాణసంకటంగా పరిణమించింది. ఇప్పటికే కోతలు పూర్తి చేసి, కొనుగోలు కేంద్రాలకు ఆశగా తెచ్చిన వడ్లు ఈ వర్షానికి పూర్తిగా తడిసి, కొట్టుకుపోయాయి. రోడ్ల పక్కన, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో తేలియాడటంతో.. రాత్రింబవళ్లు కష్టపడి పండించిన శ్రమ నీటిపాలైందని రైతులు గుండెలు బాదుకుంటున్నారు.
ఆదుకోవాలని వేడుకోలు..
ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం తక్షణమే కేంద్రాలను తెరిచి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లాల వద్ద కనీసం ధాన్యంపై కప్పుకోవడానికి సరైన టార్పాలిన్ కవర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులు నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందోనని బిక్కుబిక్కుమంటూ పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి, పంట నష్టాన్ని కచ్చితంగా అంచనా వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి తమను ఆర్థికంగా ఆదుకోవాలని నిజామాబాద్ రైతులు వేడుకుంటున్నారు.







