Mahaa Daily Exclusive

  డీజిల్ కల్లోలం…..

Share

**డీజిల్ కల్లోలం.
**రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు**
**ఒక్క లీటర్ కూడా కొరత ఉండొద్దు**
**అధికారులకు వార్నింగ్**
**యుద్ధ ప్రాతిపదికన సరఫరాకు సర్కార్ ఆదేశం**
విజయవాడ, మహా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడగ విప్పిన డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ, ఇంధన కరువుతో అల్లాడుతున్న వాహనదారులు మరియు అన్నదాతల కష్టాలను చూసి చలించిన ఆయన, సచివాలయ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు వెలుస్తుండటం, వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కట్టడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజిల్ కొరత ఉండకూడదని, యుద్ధ ప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించాలని ఆయన అధికారులకు హుకుం జారీ చేశారు. ప్రజలకు కనీస అవసరమైన ఇంధనం అందకపోవడం అభివృద్ధికి గొడ్డలి పెట్టు వంటిదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
**అధికారుల వివరణ – గణాంకాల విశ్లేషణ**
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఈ సంక్షోభంపై అధికారులు ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక సమర్పించారు. ఏపీలో మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా, సరఫరా గొలుసు తెగిపోవడం వల్ల ఇప్పటివరకు 421 బంకులు పూర్తిగా మూతపడ్డాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా వినియోగదారులు ‘ప్యానిక్ కొనుగోళ్లకు’ పాల్పడటం వల్ల కృత్రిమ డిమాండ్ ఏర్పడిందని, దీనివల్ల ఉన్న నిల్వలు కూడా క్షణాల్లో ఖాళీ అవుతున్నాయని సీఎంకు నివేదించారు. అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల చమురు దిగుమతులు , రవాణాలో అంతరాయం కలగడమే ఈ ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమని అధికారులు వివరణ ఇచ్చారు. అయితే, కారణాలు ఏవైనా సరే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని చంద్రబాబు ఆదేశించారు.
**అన్నదాతల ఆవేదన – సీఎం భరోసా**
ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఈ డీజిల్ కొరత రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. కోత మిషన్లు, ట్రాక్టర్లకు అవసరమైన డీజిల్ దొరక్కపోవడంతో చేతికి వచ్చిన పంట నేలపాలయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కళ్లాల్లో ఉన్న సమయంలో ఇంధనం కోసం బంకుల వద్ద పడిగాపులు కాయడం దురదృష్టకరమని సీఎం పేర్కొన్నారు. రైతన్నలకు ఒక్క లీటర్ డీజిల్ కూడా లోటు రాకుండా చూడాలని, జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆజ్ఞాపించారు. ఇంధన కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, అదనపు లోడ్లు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని పౌర సరఫరా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
**కృత్రిమ కొరతపై ఉక్కుపాదం**
రాష్ట్రంలో డీజిల్ సమస్యతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆజ్ఞాపించారు. ఇంధన మాఫియా లేదా బ్లాక్ మార్కెట్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. సామాన్య వాహనదారుల నుంచి భారీ వాహనాల వరకు ఎక్కడా రవాణా స్తంభించకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వేగవంతమైన చర్యల వల్ల రాబోయే 24 గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగడంతో బంకుల వద్ద మళ్ళీ సందడి నెలకొంటుందని వాహనదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Latest