• ఎంఎస్ఎంఈలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.
• రాయితీల ఫలితాలను పార్లమెంటుకు వెల్లడించాలి: ఎంపీ రవిచంద్ర
ఢిల్లీ, మహా.
పన్ను సంస్కరణలు కేవలం పెట్టుబడులను ఆకర్షించడానికే పరిమితం కాకుండా దేశీయ తయారీ, ఉపాధి కల్పన, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యక్షంగా దోహదపడేలా ఉండాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
విదేశీ పెట్టుబడులు, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగం, రియల్ ఎస్టేట్ పెట్టుబడి సంస్థలు, మౌలిక వసతుల పెట్టుబడి సంస్థలకు సంబంధించిన పన్ను విధానంలో స్పష్టత తీసుకురావడంతోపాటు వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం బిల్లు ప్రధాన ఉద్దేశమని రవిచంద్ర పేర్కొన్నారు. అయితే పన్ను సంస్కరణలు సమానత్వం, పారదర్శకత, పన్ను చెల్లింపుదారులకు స్థిరత్వాన్ని కల్పించేలా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
పెట్టుబడితోపాటు ఉద్యోగాలపై దృష్టి
పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కేవలం పెట్టుబడుల పరిమాణంతో ముడిపెట్టకుండా.. వాటి ద్వారా వాస్తవంగా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంత పెట్టుబడి వచ్చింది, ఎంత సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అయింది అన్న అంశాలను కూడా కొలిచే స్పష్టమైన ప్రమాణాలను రూపొందించాలని రవిచంద్ర సూచించారు. ప్రజాధనం రూపంలో ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలకు ప్రతిఫలంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత ప్రయోజనం చేకూరిందో ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, సమాచార సాంకేతికత, అధునాతన తయారీ రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని పేర్కొన్న ఆయన.. ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు మరింత పెరిగేలా పన్ను ప్రోత్సాహకాలను రూపొందించాలని కేంద్రాన్ని కోరారు.
ఎంఎస్ఎంఈలపై భారాన్ని తగ్గించాలి
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఎంఎస్ఎంఈ రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని రవిచంద్ర తెలిపారు. అధిక అనుసరణ వ్యయాలు, ఆర్థిక వనరుల పరిమిత లభ్యత, మార్కెట్లో అనిశ్చితి వంటి సమస్యలు చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు.
పన్ను సంస్కరణల్లో ఎంఎస్ఎంఈలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు వారి అనుసరణ భారాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చిన్న పరిశ్రమలకు పన్ను విధానాలు సరళంగా, అర్థమయ్యేలా ఉండాలని సూచించారు. పన్ను రాయితీల ప్రభావాన్ని క్రమం తప్పకుండా అంచనా వేయాలని, వాటి వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం తగ్గింది, దాని ద్వారా ఎంత పెట్టుబడి వచ్చింది, ఎన్ని ఉద్యోగాలు సృష్టించబడ్డాయన్న వివరాలను పార్లమెంటుకు తెలియజేయాలని అన్నారు.
తెలంగాణకు సముచిత ప్రాధాన్యం
దేశ ఆర్థికాభివృద్ధిలో తయారీ, సమాచార సాంకేతికత, ఎగుమతుల ద్వారా తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని రవిచంద్ర పేర్కొన్నారు. భవిష్యత్తులో పారిశ్రామిక, మౌలిక వసతుల విధానాలను రూపొందించేటప్పుడు తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి గతంలో అమలు చేసిన కొన్ని విధానాలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం తీసుకొచ్చిన ఏకగవాక్ష విధానం, గ్రానైట్ పరిశ్రమకు సంబంధించిన సబ్సిడీ విధానాలు పారిశ్రామికీకరణకు మద్దతుగా నిలిచాయని తెలిపారు. పరిశ్రమలకు భూమి కేటాయింపు, సబ్సిడీలు, అనుమతుల మంజూరును వేగవంతం చేసే విధానాలను కేంద్రం కూడా ప్రోత్సహించాలని సూచించారు.
రైతులు, పరిశ్రమలకు సమన్వయ ప్రోత్సాహకాలు
రైతులు, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు అవసరమైన ప్రోత్సాహకాలను సమన్వయంతో అందించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని రవిచంద్ర అన్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ లభ్యత, మార్కెట్ అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దేశంలో కోట్లాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంఎస్ఎంఈ రంగంపై ఆధారపడి ఉన్నారని పేర్కొన్న ఆయన.. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
పన్ను సంస్కరణల ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని రవిచంద్ర స్పష్టం చేశారు. పెట్టుబడులు రావడం మాత్రమే విజయానికి కొలమానం కాదని, వాటి ద్వారా ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతులు, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగాయన్నదే అసలు ఫలితంగా చూడాలని అన్నారు. ఈ అంశాలతో పాటు ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూర్చే మార్పులు ఉంటే బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.






