- వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో మూడు ముక్కలాట
- 30 ఏళ్లు పార్టీ కోసం పని చేసినా గుర్తింపు లేదు
- పదవులను సినిమా టికెట్లలా పంచు కుంటున్నారు
- జిల్లా జనసేన నాయకులు కరాటే ప్రభాకర్
వరంగల్, బ్యూరో మహా;
కాంగ్రెస్ పార్టీలో దాదాపు 30 ఏళ్లుగా పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసినా తగిన గౌరవం, గుర్తింపు లభించలేదని ఇటీవల ఆ పార్టీ సీనియర్ నాయకుడు కరాటే ప్రభాకర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంగళవారం వరంగల్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన కాంగ్రెస్ ను వీడి జనసేన పార్టీలో చేరిన్నట్లు అధికారికంగా ప్రకటించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటగా మారిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా కరాటే ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, అలాగే పార్టీ అధికారంలో లేని సమయంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో కష్టపడిన వారికి సరైన గుర్తింపు, గౌరవం లేకుండా పోయిందని, కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసిన సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి గౌరవం గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటగా మారిపోయిందని ఆయన ఆరోపించారు.
*సినిమా టికెట్ల లా పదవుల పంపకాలు*
కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే జిల్లా అధ్యక్షుడి పదవి అధిష్టానం ఇచ్చినా కనీస గౌరవం, గుర్తింపు లేకుండా కొందరు వ్యవహరిస్తున్నారని జనసేన నాయకులు కరాటే ప్రభాకర్ ఆరోపించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వచ్చిన పదవులను సినిమా టికెట్ల మాదిరిగా పంచు కుంటున్నారని విమర్శించారు. పార్టీని నమ్ముకున్న తనకు పదవులు రాకుండా తనను కూడా ఎన్నో విధాలుగా ఒత్తిళ్లకు గురిచేశారని, పార్టీ కోసం కష్టపడిన వారికి విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు అతి త్వరలో జనసేనలో చేయడం ఖాయం అని కరాటే ప్రభాకర్ ధీమాగా చెప్పారు. తాను పవన్ కళ్యాణ్ కోసం జనసేన లోకి రాలేదని పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరానని స్పష్టం చేశారు. పేదలకు మంచి చేయాలనే పవన్ కళ్యాణ్ దృక్పథం, సిద్ధాంతం నచ్చడంతోనే జనసేనలో చేరడం జరిగిందని పేర్కొన్నారు. జనసేన అధిష్ఠానం ఏ విధంగా ఆదేశిస్తే అదే స్థాయిలో కష్టపడి పార్టీ కోసం ప్రజల కోసం నిస్వార్ధంగా నిబద్దతతో పనిచేస్తానని కరాటే ప్రభాకర్ మీడియా ముఖంగా తెలిపారు.







