* కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ధ్వజం**
మెదక్, మహా.
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగంలో సరికొత్త విప్లవానికి కేంద్ర ప్రభుత్వం నాంది పలుకుతోందని, ప్రపంచం మెచ్చిన నేత ప్రధాని నరేంద్ర మోదీ రాకతో రాష్ట్రానికి మహర్దశ పట్టబోతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. శనివారం మెదక్ జిల్లా రామాయంపేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధను వివరించడంతో పాటు, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
**తెలంగాణకు రూ. 7,823 కోట్ల అభివృద్ధి కానుక**
వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ గారు తొలిసారిగా మే 10న తెలంగాణ గడ్డపై అడుగుపెడుతుండటం మనందరికీ గర్వకారణమని రాంచందర్ రావు అన్నారు. ఈ పర్యటన కేవలం రాజకీయమైనది కాదని, తెలంగాణ భవిష్యత్తును మార్చే అద్భుతమైన అభివృద్ధి పండుగని ఆయన అభివర్ణించారు. సుమారు రూ. 7,823 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టబోతున్నారని తెలిపారు. ముఖ్యంగా జహీరాబాద్‌లో నిర్మించనున్న ఇండస్ట్రియల్ సిటీ ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని, వరంగల్‌లోని టెక్స్టైల్ పార్క్ మరియు పీఎం మిత్ర హ్యాండ్లూమ్ పార్క్ తెలంగాణ నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హఫీజ్‌పేట్, జోగులాంబ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ల ఆధునీకరణతో పాటు జాతీయ రహదారుల విస్తరణ వంటి కార్యక్రమాల ద్వారా రవాణా రంగం సరికొత్త రూపు సంతరించుకోబోతోందని వివరించారు. రాబోయే రోజుల్లో వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్‌పోర్ట్ వంటి భారీ ప్రాజెక్టులు కూడా కార్యరూపం దాల్చుతాయని ఆయన స్పష్టం చేశారు.
**ఉద్యోగుల గోస పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం**
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. “ఒకప్పుడు ఒకటో తేదీన జీతాలు రావడం గర్వంగా చెప్పుకునే వారం, కానీ నేడు టీచర్లు, ఉద్యోగులు తమ వేతనాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది” అని విమర్శించారు. 2015 నుంచి పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చివరికి గౌరవ హైకోర్టు మొట్టికాయలు వేసి, నాలుగు వారాల్లోగా చెల్లింపులు జరపాలని ఆదేశించే వరకు ప్రభుత్వంలో చలనం రాకపోవడం కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని, వారిని కేవలం కార్పొరేషన్ సిబ్బందిగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
**రైతన్న కన్నీరు.. అస్తవ్యస్తంగా ధాన్యం సేకరణ**
రాష్ట్రంలోని అన్నదాతల పరిస్థితి వర్ణనాతీతంగా మారిందని రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తాను స్వయంగా వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పుడు కళ్ళకు కట్టిన దృశ్యాలు తనను కలిచివేసాయన్నారు. “కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలుగా పేరుకుపోయి ఉన్నా, తూకం వేయడానికి నాథుడే లేడు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు” అని వాపోయారు. లారీలు, ట్రక్కుల కొరత వల్ల ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందని, దీనిని ఆసరాగా చేసుకుని రైస్ మిల్లర్లు, మధ్యవర్తులు మరియు కొందరు అవినీతి అధికారులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకే రైతులు తమ పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి కల్పించడం అన్యాయమని, వరితో పాటు మొక్కజొన్న రైతులకు కూడా మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పటికైనా స్పష్టత ఇచ్చి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హితవు పలికారు.








