* తుమ్మిడిహెట్టి బ్యారేజీపై కీలక నిర్ణయం!
* 100 రోజుల్లో పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌పై కేబినెట్ కసరత్తు.
*సాగునీటి ప్రాజెక్టులు, ఆర్టీసీ విలీనం, కొత్త పింఛన్లపై చర్చ.
* సంక్షేమ పథకాల అమలుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్?
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో మరో కీలక అడుగు పడబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అంతర్భాగమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యతతో కూడిన చర్చ జరగనుంది. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించి, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించాలని ప్రభుత్వం ఇప్పటికే ఒక దృఢమైన సంకల్పంతో ఉంది. ఇందుకు సంబంధించి నీటిని తరలించేందుకు అధికారులు సిద్ధం చేసిన నాలుగు రకాల మార్గాల ప్రతిపాదనలను కేబినెట్ క్షుణ్ణంగా పరిశీలించనుంది. రైతులకు గరిష్ట ప్రయోజనం చేకూర్చే మార్గానికి ఈ సమావేశంలో పచ్చజెండా ఊపి, పనుల వేగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేయబోతోంది.
రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలక భాగమైన ఉద్యోగులు, పింఛనర్ల సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ రాబోయే 100 రోజుల్లోగా క్లియర్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు, నిధుల సర్దుబాటుపై కేబినెట్ భేటీలో ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ) విడుదలతో పాటు, ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం నగదు రహిత వైద్య సేవల పంపిణీ ప్రక్రియపై కూడా ఈ సమావేశంలో లోతుగా చర్చించనున్నారు. జూన్ 1 నాటికి హెల్త్ కార్డులు అందజేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు మంత్రివర్గం దిశానిర్దేశం చేయనుంది. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం చూపుతున్న ‘ఫ్రెండ్లీ’ ధోరణిని ఈ నిర్ణయాల ద్వారా మరోసారి చాటిచెప్పాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
కేవలం సాగునీరు, ఉద్యోగుల అంశాలే కాకుండా ప్రజా క్షేత్రంలో చర్చనీయాంశంగా ఉన్న మరికొన్ని కీలక అంశాలు కూడా కేబినెట్ అజెండాలో ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను కొలిక్కి తీసుకురావడం, తద్వారా వేలాది మంది కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించడంపై మంత్రివర్గం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఆసరా పింఛన్ల మంజూరు, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చే గౌరవ పురస్కారాలు మరియు సేవా కార్యక్రమాలపై చర్చించనున్నారు. పేదలకు భరోసానిచ్చే ‘ఇందిరమ్మ బీమా పథకం’ అమలుకు సంబంధించిన విధివిధానాలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. గత సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు నామినేట్ పద్ధతిన పాలక వర్గాలను నియమించేందుకు ఆమోదం తెలపడం, గచ్చిబౌలి స్టేడియాన్ని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించడం వంటి అభివృద్ధి నిరంతర ప్రక్రియలో భాగంగానే ఈ భేటీ కూడా సాగనుంది.







