Mahaa Daily Exclusive

  తెలంగాణ విద్యుత్ వ్యవస్థకు ఏఐ పహారా:…

Share

తెలంగాణ విద్యుత్ వ్యవస్థకు ఏఐ పహారా:.
*జిల్లాకు రెండు సోలార్ ప్లాంట్లు.
* రైతు డిస్కంపై అపోహలు వద్దు.
* సబ్‌స్టేషన్ల పక్కనే సోలార్ విద్యుత్ ఉత్పత్తి.
* పైలట్ ప్రాజెక్టుగా 18 ప్లాంట్లు ఖరారు.
* సబ్‌స్టేషన్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్.

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తున్న పారిశ్రామికీకరణ, ప్రాంతీయ రింగ్ రోడ్డు , హైస్పీడ్ రైల్ కారిడార్ల వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు అనుగుణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కొత్త పారిశ్రామిక వాడలకు అవసరమైన సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను యుద్ధప్రతిపాదికన ప్రారంభించాలని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి మరియు ఇంధన శాఖ ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి విద్యుత్ రంగంపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఆధునిక సాంకేతికతను జోడించడంతో పాటు, గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్ సబ్‌స్టేషన్ల పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్న వినూత్న ఆలోచనను ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారు. తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో జిల్లాకు రెండు చొప్పున మొత్తం 18 సోలార్ ప్లాంట్లను నిర్మించాలని ఆదేశించారు. భూమి అందుబాటులో ఉన్న చోట ఈ ప్రయోగాత్మక ప్లాంట్లను వెంటనే నెలకొల్పాలని, వీటికి పర్యవేక్షకులుగా నోడల్ అధికారులను నియమించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి సబ్‌స్టేషన్ వరకు ప్రసార నష్టాలను తగ్గించేందుకు ఈ విధానం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని, గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత క్రమంలో అనుమతులు ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
విద్యుత్ సరఫరా వ్యవస్థలో లోపాలను గుర్తించడానికి మరియు పంపిణీని మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏఐ సాంకేతికత ద్వారా విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడంతో పాటు, ఎక్కడైనా అంతరాయాలు కలిగితే తక్షణమే గుర్తించి సరిచేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు సామాన్యులకు సోలార్ శక్తిని చేరువ చేసేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ పవర్ పైన ప్రత్యేక అవగాహన కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ స్టౌల వినియోగం పెరిగేలా ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఇక తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటుపై విద్యుత్ శాఖ ఉద్యోగులు మరియు సిబ్బందిలో ఉన్న అపోహలను తొలగించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇది పూర్తిగా రైతుల ప్రయోజనాల కోసం ఉద్దేశించినదని, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీలు ఇతర సీనియర్ అధికారులు పాల్గొని, రాష్ట్రంలో విద్యుత్ నిల్వలు మరియు భవిష్యత్ ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించారు.