Mahaa Daily Exclusive

  ఉద్యోగులకు వరాల జల్లు….

Share

* 100 రోజుల్లో రూ. 6 వేల కోట్ల బకాయిల విడుదల.
* జూన్‌ 1కల్లా ఆరోగ్య భద్రత కార్డులు.
* పీఆర్‌సీపై తక్షణ నివేదికకు ఆదేశం.
* నిధుల వ్యయంలో ఉద్యోగులకే నిర్ణయాధికారం.
* రెండు ఏళ్లలో 67,760 నియామకాలు.
* ఉద్యోగుల సంక్షేమమే మా ప్రాధాన్యత.
* సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి వరాల జల్లు కురిపించారు. శనివారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించిన కీలక భేటీలో ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధిని ఆయన చాటిచెప్పారు. ప్రధానంగా కొత్త వేతన సవరణ కమిషన్ నివేదికను తక్షణమే సమర్పించాలని అధికారుల కమిటీని ఆదేశించినట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి, ఆ నివేదిక అందిన వెంటనే పీఆర్‌సీపై తుది నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి సుమారు రూ. 6 వేల కోట్ల రిటైర్మెంట్ బకాయిలను రాబోయే 100 రోజుల్లోగా పూర్తిగా చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఈ నిధుల వ్యయంలో ప్రాధాన్యతలను నిర్ణయించే బాధ్యతను ఉద్యోగ సంఘాలకే అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల చిరకాల వాంఛ అయిన ఆరోగ్య భద్రత కార్డులపై ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చారు. జూన్ 1వ తేదీ లోపు ఉద్యోగులందరికీ నూతన ఆరోగ్య భద్రత కార్డులను అందజేస్తామని, నగదు రహిత చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని తమ భుజాన వేసుకుని విజయవంతం చేస్తున్న ఉద్యోగుల కృషిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఇది పూర్తిగా ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వమని, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వంతో సమావేశమై, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై నివేదికలు అందించాలని ఒక క్రమబద్ధమైన వ్యవస్థను ప్రతిపాదించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దశాబ్ద కాలంగా అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను చక్కదిద్దుతూ, ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులందరికీ వేతనాలు అందేలా చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణాన్ని కల్పించామని, ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలను ఎటువంటి గందరగోళం లేకుండా, పారదర్శకమైన ప్రణాళికతో పూర్తిచేశామని చెప్పారు. గత రెండేళ్ల కాలంలోనే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 67,760 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగుల ఆశలను నెరవేర్చామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఆరోగ్య భద్రత కార్డుల ప్రతిపాదనపై ప్రభుత్వం అత్యంత సానుకూల ధోరణితో ఉందని రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకులు మారం జగదీష్, వి. లచ్చి రెడ్డి, ఏలూరి శ్రీనివాస రావు, జి. శ్రీనివాస్ రెడ్డి, పి. దామోదర్ రెడ్డి తదితర ప్రతినిధులు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో పరిష్కారం కాని అనేక సమస్యలకు ఈ ప్రజా ప్రభుత్వంలో మోక్షం లభించిందని వారు కొనియాడారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్పష్టమైన హామీల నేపథ్యంలో, మే 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమాలతో పాటు అన్ని రకాల ఆందోళనలను తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు సంఘాల నేతలు సంయుక్తంగా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వానికి, ఉద్యోగ వర్గాలకు మధ్య ఉన్న వివాదాలు సద్దుమణిగి, ఒక సానుకూల వాతావరణం నెలకొంది. తమపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వ ఆశయ సాధనలో మరింత ఉత్సాహంతో పనిచేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.