Mahaa Daily Exclusive

  తమిళ రాజకీయాల్లో ‘దళపతి’ సునామీ….

Share

తమిళ రాజకీయాల్లో ‘దళపతి’ సునామీ..
* సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే!
*ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు..
* దశాబ్దాల ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి గండి.
* మూడో స్థానానికి పడిపోయిన అధికార డీఎంకే.
* రెండు చోట్లా విజయ్ స్పష్టమైన ఆధిక్యం.
హైదరాబాద్, మహా.
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. దశాబ్దాలుగా పాతుకుపోయిన రెండు ప్రధాన ద్రావిడ పార్టీల గుత్తాధిపత్యానికి గండికొడుతూ.. కోలీవుడ్ అగ్రకథానాయకుడు, దళపతి విజయ్ తమిళ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర లిఖించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను, రాజకీయ పండితుల లెక్కలను పటాపంచలు చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అఖండ ప్రజాదరణతో దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తే, తొంభైకి పైగా స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ రాష్ట్రంలోనే ఏకైక అతిపెద్ద పార్టీగా (సింగిల్ లార్జెస్ట్ పార్టీ) టీవీకే అవతరించి సంచలనం సృష్టించింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తొలి దశలో ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ సారథ్యంలోని అధికార డీఎంకే కూటమి కాస్త ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ, ఈవీఎంల లెక్కింపు మొదలైన కొద్దిసేపటికే అసలైన ట్రెండ్ బయటపడింది. ఏమాత్రం అంచనాల్లేని టీవీకే అనూహ్యంగా పుంజుకుని ఆధిక్యంలోకి దూసుకురాగా, పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే సైతం పుంజుకుని రెండో స్థానంలో నిలిచింది. వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలని కలలు కన్న డీఎంకే కూటమి ఏకంగా మూడో స్థానానికి పడిపోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకునే దిశగా పయనిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక వల్ల అంతిమంగా తమకే లాభం జరుగుతుందని భావించిన డీఎంకే శ్రేణులకు ఈ పరిణామం శరాఘాతంగా మారింది. 2021 ఎన్నికల్లో 159 స్థానాలతో అఖండ విజయం సాధించిన డీఎంకే.. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ కంచుకోటలు సైతం బద్దలు కావడంతో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది.
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన విజయ్.. తన దూకుడుతో, వ్యూహాత్మక ప్రచారంతో తమిళ ఓటర్ల నాడిని పట్టడంలో వందశాతం సఫలమయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలోని యువత, మహిళా ఓటర్లు దళపతికి బ్రహ్మరథం పట్టారు. వారే ఎన్నికల ఫలితాలను శాసించే నిర్ణయాత్మక శక్తిగా మారారు. పార్టీ అధినేతగా విజయ్ తాను స్వయంగా బరిలోకి దిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలైన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండింటిలోనూ ప్రత్యర్థులపై స్పష్టమైన మెజారిటీతో ముందంజలో ఉండి తన సత్తా చాటారు. ఒక దశాబ్ద కాలంగా అన్నాడీఎంకే, డీఎంకేల చుట్టూనే తిరుగుతున్న తమిళ రాజకీయ చదరంగంలో ఒక నటుడు ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలకు టీవీకే చేరుకోలేకపోయినప్పటికీ, అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం ద్వారా భవిష్యత్తు తమిళ రాజకీయాలకు విజయ్ కేంద్రబిందువుగా మారారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు, ఎన్నికల ఫలితాల్లో టీవీకే ప్రభంజనం స్పష్టమవడంతో ఆ పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా దళపతి అభిమానులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో రోడ్లపైకి వచ్చి ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. తమ పార్టీ అధికారిక గుర్తింపు అయిన ‘విజిల్’ను పెదవుల మధ్య ఉంచి ఈలలు వేస్తూ.. ‘విజిల్ పోడు’ పాటలకు నృత్యాలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రాష్ట్రమంతటా విజిల్ రీసౌండ్ వస్తుందంటూ పోస్టులు పెడుతూ ఆనందంలో తేలియాడుతున్నారు. దీనికి తోడు, పార్టీ అధినేత విజయ్ నివాసం వద్ద అభిమానుల తాకిడి విపరీతంగా పెరగడంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, తొక్కిసలాటలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో ఇతర వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తంగా ద్రవిడ నాట దళపతి విజయ్ సరికొత్త శకానికి నాంది పలికారని ఈ ఎన్నికల ఫలితాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.