- అప్పుడు కాలేజీ డ్రాపౌట్
- ఇప్పుడు పొలిటికల్ కింగ్
- సినిమాల్లో సూపర్ స్టార్
- ఇదే దళపతి విజయ్ ప్రస్థానం
చెన్నై, మహా : తమిళనాడులో కొత్త రాజకీయం మొదలైంది. ఎన్నికల్లో తక్కువ అంచనా వేసిన రాజకీయ ప్రత్యర్థులకు తన కెపాసిటీ ఏంటో తెలిసేలా చేశాడు టీవీకే అధినేత జోసెఫ్ విజయ్. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ గత ఏడాది తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ స్థాపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ టీవీకే ముందంజలో ఉంది. అధికార డీఎంకే మూడో స్థానానికి పరిమితం కాగా, అన్నాడీఎంకే అనూహ్యంగా రెండో స్థానంలో నిలిచింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ గా నిలిచిన విజయ్ కాలేజీ డ్రాపౌట్. దళపతి విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విజయ్ అందుకనుగుణంగా వ్యవహరించి తమిళ రాజకీయాల్లో సరికొత్త శక్తిగా ఎదిగారు. ఎన్నికల ఫలితాల్లో టీవీకే సత్తా చాటడంతో ఆయన ఏం చదువుకున్నారని సెర్చ్ చేస్తున్న ఫ్యాన్స్ కాలేజీ డ్రాపౌట్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన విజయ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కింగ్ మేకర్‌గా మారారు. తొలి ఎన్నికతోనే సీఎం రేంజ్‌కు ఎదిగారు.
విజయ్ ఎడ్యుకేషన్ వివరాలు
టీవీకే అధినేత విజయ్ తన ప్రాథమిక విద్యను చెన్నైలోని కోడంబాక్కంలో ఉన్న ఫాతిమా స్కూల్‌లో పూర్తి చేశారు. తర్వాత ఆయన విరుగంబాక్కంలోని బాలలోక్ స్కూల్‌లో టెన్త్ వరకు చదివారు. చదువులో టాపర్ కాకపోయినా చురుకుగా ఉండేవారు. మంచి మార్కులు తెచ్చుకునే విజయ్ మనస్సు పుస్తకాల కంటే ఎక్కువగా స్టేజ్, కెమెరా వైపు మళ్లేది. ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ సినిమా దర్శకుడు కావడంతో నటన అనేది వారసత్వంగా వచ్చింది. స్కూల్ పూర్తయ్యాక విజయ్ చెన్నైలోని ప్రసిద్ధ లోయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో చేరారు. కానీ చదువు కంటే ఆయనకు సినిమాల్లోకి రావాలని కోరిక బలంగా ఉండేది.
డ్రాపౌట్ ఎలా అయ్యారు ?
కాలేజీ రోజుల్లోనే విజయ్ సినిమాల్లోకి వెళ్లాలని మనసు మళ్లింది. షూటింగ్‌లు, ఆడిషన్స్ కు వెళ్తూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు పెంచారు. దాంతో ఈ చదువులు అవి తన కెరీర్ కాదని, సినిమాలే కెరీర్ అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. దాంతో విజయ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసి ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టారు. దాంతో కాలేజీ డ్రాపౌట్‌గా మారారు. విజయ్ మొదట నటుడిగా నిరూపించుకున్నాడు. ఒక్కో సినిమాతో తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశాయి. ఈ క్రమంలో దక్షిణాది సినీ పరిశ్రమలలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు. సినిమాలతో పాటు సమాజంపై కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా విజయ్ కి పేరుంది. గత పదేళ్లలో విజయ్ తీసిన సినిమాలు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. యువతపై ఆయనకున్న పట్టు, సామాజిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడటం సామాన్యులకు మరింత దగ్గర చేశాయి.
గౌరవ డాక్టరేట్‌తో సత్కారం
విజయ్ తన డిగ్రీని పూర్తి చేయలేకపోయినా సినిమాల్లో చేసిన కృషిని ఎవరూ విస్మరించలేరు. ఈ క్రమంలో 2007లో డాక్టర్ ఎం.జి.ఆర్. ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌తో విజయ్‌ను సత్కరించింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావించిన విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పాడు. సొంత పార్టీ ‘టీవీకే’ను స్థాపించారు. అభ్యర్థుల ఎంపికలో సైతం చురుకుగా వ్యవహరించి నేడు ప్రయోజనం పొందుతున్నారు. ఇటీవల ఎగ్జిట్ పోల్స్ అన్నీ డీఎంకే అధికారం అని చెప్పగా వాటిని తప్పు అని నిరూపిస్తూ విజయ్ టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం చేయనున్నారు.







