Mahaa Daily Exclusive

  బెంగాల్‌లో సువేందు చేతికే పగ్గాలు….

Share

బెంగాల్‌లో సువేందు చేతికే పగ్గాలు.
* మే 9న బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం!
* సీఎం రేసులో నందిగ్రామ్ వీరుడు.
* రవీంద్రుడి జయంతి రోజే కొలువుదీరనున్న నయా సర్కార్.
* ‘పొచిశే బోయ్ షోక్’ వేడుకల్లో చారిత్రక ఘట్టం.
హైదరాబాద్, మహా.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కమలదళం ముహూర్తం ఖరారు చేసింది. బెంగాలీల సాంస్కృతిక వారసత్వాన్ని, సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని మే 9వ తేదీన అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తోంది.
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంచుకున్న తేదీ వెనుక బీజేపీ భారీ వ్యూహమే దాగి ఉంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని బెంగాల్ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే ‘పొచిశే బోయ్ షోక్’ సాంస్కృతిక వేడుకల రోజే నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. బెంగాల్ ప్రజల గుండెల్లో రవీంద్రుడికి ఉన్న అత్యున్నత స్థానాన్ని, వారి సాంస్కృతిక మూలాలను గౌరవిస్తూ, తాము కూడా బెంగాల్ మట్టి బిడ్డలమే అనే బలమైన సందేశాన్ని పంపేందుకే బీజేపీ ఈ చారిత్రక రోజును ఎంచుకుంది. జాతీయ అగ్రనేతలు, దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ముఖ్యమంత్రులు, మేధావుల సమక్షంలో ఈ వేడుకను అద్భుతంగా నిర్వహించి, బెంగాల్ అభివృద్ధిలో ఒక సరికొత్త శకానికి నాంది పలకాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు పగ్గాలు చేపట్టబోతున్నారన్న ఉత్కంఠకు దాదాపు తెరపడినట్లేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి సువేందు అధికారి పేరును అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఒకప్పుడు దీదీకి కుడిభుజంగా ఉండి, ఆ తర్వాత బీజేపీలో చేరి పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమించిన సువేందుకే కమలనాథులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అజేయ నాయకురాలిగా పేరుతెచ్చుకున్న మమతా బెనర్జీని నందిగ్రామ్ లాంటి కీలక నియోజకవర్గంలో ఓడించిన నాయకుడిగా సువేందు అధికారికి పార్టీలో, ప్రజల్లో తిరుగులేని ఇమేజ్ ఏర్పడింది. బెంగాల్ రాజకీయాల్లో మమతను రెండుసార్లు ఓడించిన ఏకైక నాయకుడిగా సువేందు సాధించిన రికార్డు ఆయనను ముఖ్యమంత్రి రేసులో అందరికంటే ముందు నిలబెట్టింది.
క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేయడంలో, అధికార పార్టీ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో సువేందు కనబరిచిన ధైర్యసాహసాలకు జాతీయ నాయకత్వం ముగ్ధురాలైంది. బెంగాల్ లాంటి క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పకడ్బందీగా నడపాలంటే సువేందు లాంటి మాస్ లీడర్ మాత్రమే సరైన వ్యక్తని అధిష్టానం బలంగా నమ్ముతోంది. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన నాయకుడిగా, రాష్ట్ర నలుమూలలా బలమైన క్యాడర్ ఉన్న సువేందు చేతికి పగ్గాలు అప్పగిస్తే రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయవచ్చని బీజేపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారు. రవీంద్రుడి జయంతి సాక్షిగా, బెంగాల్ ప్రజల ఆశీస్సులతో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమేనని రాజకీయ పరిశీలకులు సైతం స్పష్టం చేస్తున్నారు.