*తమిళనాట దళపతి సెన్సేషన్.. ఎన్టీఆర్ తర్వాత విజయే!
*తొలి ఎన్నికల్లోనే సూపర్ హిట్.. ద్రవిడ కోటలో మోగిన ‘విజిల్’
*ఒంటరి పోరుతోనే సీఎం పీఠం.. సింగిల్‌గా బరిలోకి దిగి వందకు పైగా స్థానాల్లో ఆధిక్యం
హైదరాబాద్, మహా.
రాజకీయ అరంగేట్రంలోనే అఖండ విజయం సాధించి, ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం అన్నది సామాన్యమైన విషయం కాదు. నాలుగు దశాబ్దాల క్రితం తెలుగునాట ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం లాంటి చరిత్ర.. ఇప్పుడు తమిళనాట పునరావృతమైంది! దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ దళపతి విజయ్ సరికొత్త సంచలనం సృష్టించారు. ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ తొలి ఎన్నికల్లోనే సింగిల్‌గా బరిలోకి దిగి ఏకంగా వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతోంది. దీంతో కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి విజయే అన్నది స్పష్టమైంది. దక్షిణాదిలో ఎంతో మంది సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ.. పార్టీ పెట్టిన తొలి యత్నంలోనే అత్యున్నత పీఠాన్ని దక్కించుకున్న రికార్డు కేవలం ఎన్టీఆర్, ఎంజీఆర్, ఆ తర్వాత ఇప్పుడు దళపతి విజయ్‌కే దక్కడం గమనార్హం. విజయ్‌కాంత్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి అగ్ర హీరోలు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తొలి అడుగులోనే ఈ స్థాయి సునామీని సృష్టించి నేరుగా సీఎం పీఠాన్ని అధిష్టించలేకపోయారు.
**అతి తక్కువ సమయంలోనే అద్భుత ఫలితం**
రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన నాటి నుంచి ఎన్నికల బరిలో నిలిచే వరకు విజయ్ ప్రయాణం అత్యంత శరవేగంగా సాగింది. 2024 ఫిబ్రవరి 2న టీవీకే పార్టీని ప్రకటించిన ఆయన.. ఆగస్టు 22న జెండాను, గీతాన్ని ఆవిష్కరించారు. అక్టోబర్ 27న సిద్ధాంతాలను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లారు. మరీ ముఖ్యంగా 2026 జనవరి 22న కేంద్ర ఎన్నికల సంఘం టీవీకేకు ‘విజిల్’ గుర్తును కేటాయించింది. అంటే ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు మాత్రమే గుర్తు ఖరారైనప్పటికీ, అతి స్వల్ప వ్యవధిలోనే 234 నియోజకవర్గాల ప్రజలకు తన అజెండాను, పార్టీ గుర్తును చేరవేయడంలో విజయ్ నూరు శాతం సఫలమయ్యారు. మార్చి 18న ఏ కూటమితోనూ పొత్తు పెట్టుకోబోమని అత్యంత ధైర్యంగా ప్రకటించి, సింగిల్‌గా బరిలోకి దిగి రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేశారు.
**వ్యూహంలో ఎంజీఆర్ బాట**
విజయ్ వేసిన రాజకీయ అడుగులు ఒకప్పటి ద్రవిడ దిగ్గజం ఎంజీఆర్ వ్యూహాన్ని తలపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి డీఎంకే పార్టీని సీఎన్ అన్నాదురై స్థాపించగా.. ఆయన మరణానంతరం డీఎంకేలో అపారమైన ప్రజాదరణ ఉన్న ఎంజీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధితో విబేధించారు. 1972లో డీఎంకే మంత్రుల ఆస్తుల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేసి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎంజీఆర్.. వారం రోజుల్లోనే అన్నాడీఎంకేను స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. అన్నాదురై ఆశయాల సాధనకు అసలైన వారసులం తామేనని ప్రకటించుకుని 1977 ఎన్నికల్లో 144 సీట్లతో నిర్ణయాత్మక విజయాన్ని అందుకున్నారు. సరిగ్గా అదే తరహాలో ప్రస్తుత డీఎంకే, అన్నాడీఎంకేల అవినీతి, కుటుంబ పాలనతో విసుగుచెందిన ప్రజలకు తానే ఏకైక, అసలైన ప్రత్యామ్నాయమని విజయ్ బలంగా నమ్మించారు. ఆయన ఎంచుకున్న ఆ వ్యూహం నేడు అక్షరసత్యమై క్షేత్రస్థాయిలో అఖండ విజయంగా రూపాంతరం చెందింది.
**ఒంటరి పోరు.. ఎన్టీఆర్, ఎంజీఆర్‌లను మించిన సాహసం**
ఎన్నికల వ్యూహంలో విజయ్ ప్రదర్శించిన ధైర్యం దిగ్గజ నాయకులైన ఎన్టీఆర్, ఎంజీఆర్‌ల కంటే ఒక అడుగు ముందే ఉందని చెప్పాలి. నందమూరి తారక రామారావు తన మొదటి ఎన్నికల్లో (1983) సంజయ్ విచార్ మంచ్ పార్టీతో పొత్తు పెట్టుకుని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 294 స్థానాల్లో 289 చోట్ల పోటీ చేసి, పొత్తులో భాగంగా ఐదు స్థానాలను ఆ పార్టీకి కేటాయించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 202 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించింది. అలాగే ఎంజీఆర్ కూడా తన తొలి ఎన్నికల్లో (1977) సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ వంటి చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. ఆ సంకీర్ణ కూటమి 144 చోట్ల విజయం దక్కించుకోగా, అన్నాడీఎంకే 130 చోట్ల గెలిచింది. కానీ, దళపతి విజయ్ ఇందుకు పూర్తి భిన్నంగా, ఎలాంటి అండ లేకుండా తమిళనాట ‘సింగిల్’ గానే తలపడ్డారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు.. ఏ కూటమిలోనూ చేరలేదు. అగ్రశ్రేణి ద్రవిడ పార్టీలను ఒంటరిగా ఢీకొట్టి, దశాబ్దాల వారి ఆధిపత్యానికి గండికొడుతూ టీవీకేను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబెట్టి సరికొత్త రాజకీయ శకానికి నాంది పలికారు.







