Mahaa Daily Exclusive

  ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్ర బృందానికి రోడ్డు ప్రమాదం….

Share

ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్ర బృందానికి రోడ్డు ప్రమాదం.
* అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ప్రొడక్షన్ వాహనం.
* ఒకరు మృతి, మరో ఐదుగురికి తీవ్ర గాయాలు.
* హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో దుర్ఘటన.
హైదరాబాద్, మహా.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం సిబ్బందితో వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు , పోలీసుల సమాచారం ప్రకారం.. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. చిత్ర బృందానికి చెందిన ప్రొడక్షన్ వాహనం వేగంగా వెళ్తూ ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ క్రమంలో అదుపు చేసుకోలేక రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఇందులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే దుర్మరణం పాలు కాగా, మిగిలిన వారికి గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఊహించని ఘటనతో ‘ఫౌజీ’ చిత్ర బృందంలో తీవ్ర విషాదం నెలకొంది.