- నిశీధిలో నిప్పుకణం.
- మారువేషంలో మహిళా ఐపీఎస్ సాహసం!
హైదరాబాద్, మహా.
నగర పొలిమేరల్లో అర్ధరాత్రి వేళ ఏం జరుగుతోంది? సామాన్యుడికి రక్షణగా ఉండాల్సిన ఖాకీ నిఘా ఎక్కడ? మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి ఆ ఉన్నతాధికారిణి ఏసీ గదులను వీడారు.. తన హోదాను పక్కన పెట్టారు.. సామాన్య మహిళలా మారువేషం ధరించి చీకటి వీధుల్లోకి అడుగుపెట్టారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐపీఎస్ సుమతి ప్రదర్శించిన ఈ సాహసోపేత కర్తవ్య నిర్వహణ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆ గడియారం ముల్లు రాత్రి 12 గంటలు దాటింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతం అది. పగలు జనసందోహంతో కిటకిటలాడే ఆ ప్రాంతం అర్ధరాత్రి అయ్యేసరికి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని సమాచారం అందుకున్న సుమతి , స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమయ్యారు. ఎటువంటి భద్రతా సిబ్బంది లేకుండా, గన్‌మెన్ల పహారా లేకుండా, కేవలం ఒక సాదాసీదా సామాన్య మహిళలా ఆమె బస్టాండ్‌లో నిలబడ్డారు. అక్కడ ఆమెకు ఎదురైన అనుభవాలు నాగరిక సమాజం తలదించుకునేలా ఉన్నాయి.
ఆమె ఎవరో తెలియని కొందరు మృగాళ్లు, మత్తులో జోగుతున్న పోకిరీలు ఆమెను చుట్టుముట్టారు. రక్షణ కల్పించాల్సిన చోట రాక్షసంగా ప్రవర్తించారు. ‘నీ రేటు ఎంత?’ అంటూ సభ్య సమాజం అసహ్యించుకునేలా వెకిలి ప్రశ్నలు వేశారు. ఆ అధికారిణి గుండెల్లో ఆవేదన రగిలినా, వ్యవస్థలోని లోపాలను పూర్తిగా పసిగట్టే వరకు ఆమె మౌనంగానే భరించారు. దాదాపు మూడు గంటల పాటు ఆమె అక్కడే గడిపారు. ఈ సుదీర్ఘ సమయంలో ఒక్కటంటే ఒక్క పెట్రోలింగ్ వాహనం గానీ, నీడలా ఉండాల్సిన పోలీసు కానిస్టేబుల్ గానీ అక్కడ కనిపించకపోవడం గమనార్హం. భద్రతా వ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని ఈ ఘటన కళ్లకు కట్టినట్లు చూపింది.
మరీ ముఖ్యంగా, అక్కడ గుమిగూడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువత ఉండటం అత్యంత విచారకరం. వారు మద్యం, గంజాయి మత్తులో తూలుతూ మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్న తీరును చూసి ఆ అధికారిణి నివ్వెరపోయారు. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఒక బీట్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్న తర్వాతే అసలు కథ మొదలైంది. సాధారణ మహిళగా ఉన్న వ్యక్తి తన కమిషనర్ అని గుర్తించిన ఆ కానిస్టేబుల్ ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే సమాచారం అందుకున్న ఎస్సై అక్కడికి చేరుకుని సెల్యూట్ చేయడంతో, అంతసేపు ఆమెను వేధించిన పోకిరీల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
వెంటనే స్పందించిన పోలీసులు దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. మత్తు దిగిన తర్వాత వారి ముఖాల్లో కనిపించిన భయం, వారు చేసిన నేరానికి ప్రాయశ్చిత్తం కాదని భావించిన కమిషనర్ సుమతి వారికి గట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. చదువుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన వయసులో మత్తుకు బానిసలై, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే జీవితాలు ఎలా నాశనం అవుతాయో గట్టిగా హెచ్చరించారు. ఈ సంఘటన కేవలం నేరస్థులను పట్టుకోవడమే కాకుండా, పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం ఎంత అవసరమో చాటిచెప్పింది. ఏసీ గదుల్లో కూర్చుని ఇచ్చే ఆదేశాల కంటే, క్షేత్రస్థాయిలో సమస్యలను ఎదుర్కొన్నప్పుడే పరిష్కారం లభిస్తుందని నిరూపించిన సుమతి గారి సాహసాన్ని యావత్ సమాజం కొనియాడుతోంది.








