నామినేటెడ్ కొలువుల పండుగ.
* 18 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం!
* కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్.
• సామాజిక న్యాయానికి మహర్దశ.
*’ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా విడుదల.
*11 కార్పొరేషన్లకు వైస్ చైర్మన్లను ప్రకటించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
హైదరాబాద్, మహా.
**రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక సమీకరణాలు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ 18 కార్పొరేషన్లకు చైర్మన్లను, 11 కార్పొరేషన్లకు వైస్ చైర్మన్లను ప్రకటిస్తూ జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పేరిట సాధారణ పరిపాలన శాఖ అధికారికంగా ఉత్తర్వులు (జీవో ఆర్టీ నంబర్ 600, 601, 602) జారీ చేసింది. పదవులు ఆశించి భంగపడిన వారికి, ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన విధేయులకు ఈ నియామకాలతో సముచిత స్థానం దక్కింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం…తాజాగా వివిధ కుల సంఘాలు, సంక్షేమ బోర్డులు, ఏజెన్సీలకు పాలకమండళ్లను నియమించి ఆయా వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేసింది**
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల పందేరం ఒక కొలిక్కి వచ్చింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ముఖ్యమంత్రి ఆమోదంతో వెలువడిన ఈ జాబితా పార్టీ వర్గాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అత్యంత కీలకమైన తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్ గా సుదిని రామిరెడ్డి నియమితులు కాగా, అదే ట్రిబ్యునల్ కు సభ్యులుగా కృష్ణ కుమార్ నాగులూరి, బూస వేణుగోపాల్ యాదవ్ లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గ్రామీణ స్థాయి వివాదాల పరిష్కారం, పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి ఈ నియామకాలు దోహదం చేయనున్నాయి.
అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఏకంగా 11 వివిధ కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్ల జోడీని ప్రభుత్వం ఒకేసారి ప్రకటించింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బస్వరాజు శ్రీనివాస్ ను నియమించగా, వైస్ చైర్మన్ బాధ్యతలను పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ కు అప్పగించారు. రజక కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ దాసరిరాజు అజయ్ కుమార్, వైస్ చైర్మన్ గా బంగారు బాబు ఎంపికయ్యారు. గీత కార్మికుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన టాడీ ట్యాపర్స్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ గా కేసం నాగరాజు గౌడ్ లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పెరిక కార్పొరేషన్ చైర్మన్ గా దొంగరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ గా బుడగం శ్రీనివాస్ ఎంపిక కాగా, మేర కార్పొరేషన్ కు చైర్మన్ గా సంగ వెంకటరాజం, వైస్ చైర్మన్ గా ఎం. లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ గా గట్టు తిమ్మప్పకు, వైస్ చైర్మన్ గా బోయ నగేష్ కు అవకాశం దక్కింది.
రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గాలకు ఈ నియామకాల్లో సింహభాగం దక్కింది. మున్నూరుకాపు కార్పొరేషన్ బాధ్యతలను చైర్మన్ గా బొమ్మ శ్రీరామ్, వైస్ చైర్మన్ గా అల్లం భాస్కర్ స్వీకరించనున్నారు. యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ కు ఎం. రఘునాథ్ యాదవ్ ను చైర్మన్ గా, గజ్జి భాస్కర్ యాదవ్ ను వైస్ చైర్మన్ గా ఎంపిక చేశారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా గుంజ రేణుక నారాయణ, వైస్ చైర్మన్ గా బత్తుల వెంకటేష్ నియమితులయ్యారు. చేనేత రంగం అభివృద్ధి కోసం పని చేసే తెలంగాణ హ్యాండ్ లూమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా దూడెం వెంకట రమణ, వైస్ చైర్మన్ గా జక్కని అనిత లను ప్రభుత్వం నియమించింది. కమ్మ కార్పొరేషన్ కు బండి రమేష్, పరుచూరి మురళి లు వరుసగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నారు.
వీరితో పాటుగా రాష్ట్ర స్థాయిలోని అత్యంత కీలకమైన పలు ఫెడరేషన్లు, ఏజెన్సీలకు చైర్మన్లను ఖరారు చేశారు. పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా గూడూరు శ్రీనివాస్, తెలంగాణ భట్రాజ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ గా సీహెచ్. బాలరాజు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా జువ్వాడి నర్సింగరావు నియమితులయ్యారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ.. తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ గా కొల్లె సరితను, తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ చైర్మన్ గా చరణ్ కౌశిక్ యాదవ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, భాషాభివృద్ధి, సాహిత్య రంగాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ గా విద్యావేత్త ప్రొఫెసర్ వెంకటనారాయణను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నియామకాలన్నీ రెండేళ్ల పాటు అమలులో ఉంటాయని సాధారణ పరిపాలన శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తమ తమ సామాజిక వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో పని చేస్తామని నూతనంగా ఎంపికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు హర్షం వ్యక్తం చేశారు. తగిన ప్రాతినిధ్యం కల్పించినందుకు సీఎంకు, టీపీసీసీ చీఫ్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.








