ఏపీకి మరో భారీ పెట్టుబడి.
* శ్రీసిటీలో రూ. 863 కోట్లతో క్యారియర్ సంస్థ ప్లాంట్.
* ఏఐ ఎకానమీకి తగ్గట్టుగా మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్.
* 15 అడ్వాన్స్డ్ ఆర్ అండ్ డీ ల్యాబ్స్ ఏర్పాటు.
* అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్ హబ్‌గా మారుతున్న ఏపీ.
* సంస్థ ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు.
అమరావతి, మహా.
పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక భారీ ప్రాజెక్టు దక్కింది. ప్రముఖ గ్లోబల్ సంస్థ ‘క్యారియర్’ ఏపీలోని శ్రీసిటీలో అత్యాధునిక హెచ్‌వీఏసీ చిల్లర్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఏకంగా రూ.863 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ ఫెసిలిటీకి లాంఛనంగా భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ ప్రాజెక్టు ఏపీ పారిశ్రామిక రంగానికి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఎకానమీకి అవసరమైన పూర్తిస్థాయి తయారీ వ్యవస్థను నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ కేంద్రంలో ప్రధానంగా 1,500 టీఆర్ సామర్థ్యానికి మించిన హై-కెపాసిటీ కమర్షియల్ హెచ్‌వీఏసీ చిల్లర్లను (భారీ శీతలీకరణ యంత్రాలు) ఉత్పత్తి చేయనున్నారు. ఇక్కడ కేవలం తయారీకే పరిమితం కాకుండా, అత్యుత్తమ సాంకేతికతతో కూడిన 15 అడ్వాన్స్డ్ టెస్టింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ల్యాబ్‌లను కూడా నెలకొల్పనుండటం విశేషం. ఈ అడుగుతో హై-ఎండ్ ఇండస్ట్రియల్ కూలింగ్ సిస్టమ్స్ తయారీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఒక అత్యంత కీలకమైన కేంద్రంగా అవతరించనుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకానమీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, దానికి అనుగుణమైన మౌలిక వసతుల కల్పనపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం డేటా సెంటర్లను మాత్రమే ఆకర్షించడం కాకుండా, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పూర్తిస్థాయి మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ను (తయారీ వ్యవస్థను) రాష్ట్రంలోనే అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ దార్శనికతకు క్యారియర్ సంస్థ రాక ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. రాష్ట్రం ఇప్పుడు సామర్థ్యం ఆధారిత వృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తోందని, తద్వారా అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్, హై-వాల్యూ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటోందని పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
శ్రీసిటీలో క్యారియర్ సంస్థ అడుగుపెట్టడం పట్ల రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో ఇదొక కీలకమైన మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడంలో, అంకురార్పణ చేయడంలో సహకరించిన క్యారియర్ గ్లోబల్ చైర్మన్ అండ్ సీఈఓ డేవిడ్ గిట్లిన్, ఆ సంస్థ ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (క్లైమేట్ సొల్యూషన్స్) ప్రెసిడెంట్ మైఖేల్ ఎల్. గిర్జెస్ తదితరులకు మంత్రి లోకేష్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ వేగవంతమైన నిర్ణయాలకు అద్దం పట్టేలా ‘క్యారియర్ కమ్స్ టు ఏపీ’ ‘చూజ్ స్పీడ్ చూజ్ ఏపీ’ అనే నినాదాలు ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో మారుమోగుతున్నాయి.








