కార్పొరేషన్లకు చైర్మన్లయితే ఉన్నారు.. నిధులేవీ సార్?
*పదవులపై ఉన్న శ్రద్ధ.. పైసలివ్వడంపై ఏదీ?.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.
*కేటాయించింది రూ.14,521 కోట్లు.. ఖర్చు చేసింది కేవలం రూ.305 కోట్లే!
*రాజకీయ పునరావాస కేంద్రాలుగా కార్పొరేషన్లు.
* కాంగ్రెస్ సర్కార్ వివక్షపై బీఆర్ఎస్ పోరాటం.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో నూతనంగా పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ప్రభుత్వం 17 కార్పొరేషన్లకు చైర్ పర్సన్లను ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. నిధులు, విధులు లేకుండా కుర్చీలు అప్పజెబితే కులవృత్తులు, అట్టడుగు వర్గాలకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని 33 కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల, వాస్తవ ఖర్చులకు సంబంధించిన ప్రభుత్వ అధికారిక గణాంకాలను బయటపెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన అనుచరులకు పదవులు కట్టబెట్టి వారిని సంతృప్తి పరచడంపై ఉన్న శ్రద్ధ, ఆయా సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం నిధులు విడుదల చేయడంపై ఏమాత్రం లేదని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికే పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన వారు, చేతిలో చిల్లిగవ్వ లేక ప్రజలకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేక తమ పదవీకాలాన్ని ముగించే పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. నిధులు ఇవ్వకుండా కేవలం కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే ఏం లాభమని, అసలు ఆయా సంస్థలను ఏర్పాటు చేసిన ఉద్దేశ్యాన్నే కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ కేటాయింపుల గణాంకాలను సాక్ష్యంగా చూపుతూ కాంగ్రెస్ సర్కార్ డొల్లతనాన్ని హరీశ్ రావు బయటపెట్టారు. రాష్ట్రంలోని మొత్తం 33 సంక్షేమ సంస్థలకు (కార్పొరేషన్లు/ఫెడరేషన్లు) ప్రస్తుత ప్రభుత్వ కాలపరిమితిలో బడ్జెట్ అంచనా కింద రూ. 14,521.98 కోట్లు చూపించారని, కానీ వాస్తవంగా విడుదల చేసింది కేవలం రూ. 3,198.07 కోట్లు మాత్రమేనని ఆయన వెల్లడించారు. అంతకంటే దారుణం ఏమిటంటే.. విడుదలైన నిధుల్లో చివరకు నిరుపేదలకు, లబ్ధిదారులకు వాస్తవంగా ఖర్చు చేసింది కేవలం రూ. 305.6 కోట్లు మాత్రమేనని విమర్శించారు. మాల, మాదిగ, సంత్ సేవాలాల్, కొమురం భీమ్, ఏకలవ్య, ఆర్యవైశ్య తదితర కార్పొరేషన్లకు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం ఆయా వర్గాల పట్ల కాంగ్రెస్ చూపుతున్న తీవ్ర వివక్షకు నిదర్శనమని మండిపడ్డారు.
బీసీ వర్గాల కార్పొరేషన్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపు, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ, మేదర, వాల్మీకి, బోయ, పద్మశాలి, పెరిక, మేర తదితర కార్పొరేషన్లకు సుమారు రూ. 100 కోట్ల చొప్పున కేటాయింపులు చూపి, రూ. 25 కోట్లు విడుదల చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారని.. కానీ అందులోంచి ఒక్క రూపాయి కూడా (సున్నా శాతం) ఖర్చు చేయకపోవడం దారుణమన్నారు. మొత్తం 33 కార్పొరేషన్లకు గాను దాదాపు 21 కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు వేల కోట్లు కేటాయించినట్లు కాగితాలపై చూపించి ఆచరణలో నిధులు దారి మళ్లించారని ధ్వజమెత్తారు.
ఈ కార్పొరేషన్ల నిధుల మళ్లింపు, నిర్లక్ష్యంపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసినా వారి నుంచి ఎలాంటి సరైన సమాధానం రాలేదని హరీశ్ రావు గుర్తుచేశారు. గత కేసీఆర్ పాలనలో కులవృత్తుల వారిని ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించామని, కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఆ పథకాలన్నీ స్తంభించిపోయాయని ఆయన వాపోయారు. చేతివృత్తుల వారి ఆవేదన అరణ్య రోదనగా మిగిలిపోయిందన్నారు. ఇప్పటికైనా నిధులు లేని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి చేతులు దులుపుకోవడం మానేసి, ఆయా కులాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం తక్షణమే బకాయి నిధులను విడుదల చేసి వాస్తవంగా వినియోగించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.








