ప్రేమ ‘శిక్ష’… కత్తుల వేట!.
* సికింద్రాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఘోర హత్య.
* నడిరోడ్డుపై రక్తపు మడుగులో యవన్.
* 17 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా చంపిన యువతి బంధువులు.
* సీతాఫల్‌మండిలో యువకుడిని వేటాడి చంపిన దుండగులు.
హైదరాబాద్, మహా.
ప్రేమ వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన సికింద్రాబాద్ పరిధిలో తీవ్ర కలకలం సృష్టించింది. తన కూతురిని ప్రేమిస్తున్నాడన్న కక్షతో, యువతి బంధువులు ఒక యువకుడిని మృగాల్లా వేటాడి, నడిరోడ్డుపై అతి కిరాతకంగా హతమార్చారు. జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన యవన్ (23) అనే బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి, సీతాఫల్‌మండికి చెందిన ఒక యువతిని గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు పలుమార్లు యవన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. అయినప్పటికీ, తన ప్రేమను వదులుకోలేకపోయిన యవన్, సీతాఫల్‌మండిలో ఉండే తన స్నేహితుడి ఇంట్లోనే ఉంటూ తరచూ ఆ యువతిని కలుస్తుండేవాడు. తమ హెచ్చరికలను లెక్కచేయకుండా తమ కళ్ల ముందే తిరుగుతున్నాడన్న కోపం యువతి కుటుంబ సభ్యుల్లో కక్షగా మారింది.
బుధవారం రాత్రి యవన్ తన స్నేహితుడి ఇంటి వద్ద ఉన్న సమయంలో, పక్కా పథకం ప్రకారం మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు దుండగులు అతడిపై ఒక్కసారిగా కత్తులతో దాడికి దిగారు. ఊహించని ఈ దాడితో షాక్‌కు గురైన యవన్, వారి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి నడిరోడ్డుపైకి పరుగులు తీశాడు. అయితే, కసితో రగిలిపోతున్న నిందితులు అతడిని వదలకుండా వెంటాడారు. జనం చూస్తుండగానే నడిరోడ్డుపై యవన్‌ను పట్టుకుని, కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. ఈ దాడిలో యవన్ శరీరంలో 17 చోట్ల లోతైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ యవన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. రద్దీగా ఉండే రోడ్డుపై జరిగిన ఈ దారుణ హత్యను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమించిన యువతి బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఒక మేధావిగా ఎదగాల్సిన విద్యార్థి, ఇలా ప్రేమ పేరుతో జరిగిన గొడవల్లో ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది








