Mahaa Daily Exclusive

  తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు.

Share

  • డీఎంకే కూటమికి ఎండీఎంకే గుడ్‌బై.
  • సీఎం విజయ్ వైపు అడుగులు వేస్తున్న వైకో.
  • పార్టీని బలహీనపరిచేందుకు డీఎంకే కుట్ర చేసిందన్న ఎండీఎంకే.
  • వారసత్వ రాజకీయాలే వైకో పాలిట శాపమన్న డీఎంకే నేతలు.
  • పార్టీ అధినేత నిర్ణయాన్ని ధిక్కరించిన ఇద్దరు ఎండీఎంకే ఎమ్మెల్యేలు.
  •  ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లు డీఎంకే ఎంపీల సంకేతాలు.

    చెన్నై, మహా.
    తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తో గత తొమ్మిదేళ్లుగా కొనసాగిస్తున్న సుదీర్ఘ రాజకీయ బంధాన్ని మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) అధికారికంగా తెంచుకుంది. శనివారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కూటమి నుంచి బయటకు రావడం వరకే ప్రకటన చేసినప్పటికీ, తదుపరి అడుగులు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కజగం) కూటమి వైపేనని ఎండీఎంకే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
    సీఎం విజయ్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఈ సమావేశంలో ఎండీఎంకే పలు కీలక తీర్మానాలు చేసింది. అవినీతి రహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్న విజయ్ సర్కారుకు మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేసింది. ముఖ్యంగా మేఘదాతు డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకోవడం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ లాంటి కీలక అంశాల్లో ప్రభుత్వం ఎక్కడా రాజీపడని వైఖరిని ప్రదర్శించాలని ఎండీఎంకే కోరింది. టీవీకే కూటమిలో చేరికపై ప్రత్యక్ష ప్రకటన చేయకపోయినప్పటికీ, తీర్మానాల సారాంశాన్ని బట్టి చూస్తే పొత్తు ఖాయమనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
    కూటమి నుంచి వైదొలగడానికి గల కారణాలను వివరిస్తూ డీఎంకేపై ఎండీఎంకే తీవ్ర ఆరోపణలు గుప్పించింది. డీఎంకే కూటమిలో ఇకపై కొనసాగలేని పరిస్థితులు నెలకొన్నాయని, తమ పార్టీని ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచేందుకు మిత్రపక్షమే కుట్రలు చేసిందని తీర్మానంలో ఆరోపించింది. అంతేకాకుండా, బద్ధ శత్రువైన ఏఐఏడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే రహస్య ప్రణాళికలు రచించిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఆరోపణలను డీఎంకే నేతలు దీటుగా తిప్పికొట్టారు. ఒకప్పుడు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా బలంగా గళమెత్తిన వైకో.. ఇప్పుడు తన కుమారుడు దురై వైకోకు పార్టీలో పెద్దపీట వేయడం వల్లే ఎండీఎంకే బలహీనపడిందని డీఎంకే నేత సయ్యద్ హఫీజుల్లా తీవ్ర విమర్శలు చేశారు. ఎండీఎంకేకు అసెంబ్లీ, పార్లమెంటులో గౌరవప్రదమైన ప్రాతినిధ్యం లభించేలా చేసింది ముమ్మాటికీ డీఎంకే పార్టీనే అని ఆయన గుర్తుచేశారు.
    ఒకవైపు డీఎంకేతో బంధం తెంచుకున్న వైకోకు, సొంత పార్టీలోనే అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు చెందిన ‘ఉదయిస్తున్న సూర్యుడు’ గుర్తుపై పోటీ చేసి గెలిచిన ఇద్దరు ఎండీఎంకే ఎమ్మెల్యేలు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఏకంగా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించి, తాము డీఎంకే కూటమితోనే కొనసాగుతామని కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామంతో ఎండీఎంకే అధికారికంగా టీవీకేతో కలిసినా, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు దూరం కావడంతో ప్రభుత్వ బలం తక్షణమే పెరిగే అవకాశం లేకుండా పోయింది. అలాగే ఎలాంటి ఉప ఎన్నికలకు ఆస్కారం కూడా లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
    టీవీకే ప్రభుత్వం ఇటీవల ఎదుర్కొన్న విశ్వాస పరీక్ష సమయంలో ఎండీఎంకే ఓటింగ్‌కు దూరంగా ఉండటంతోనే ఈ రాజకీయ మార్పులకు పునాది పడింది. ఆ తర్వాత వైకో, ఆయన కుమారుడు దురై వైకోలు ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు టీవీకే సీనియర్ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎండీఎంకే చేరిక లాంఛనమే కానుంది. ఇప్పటికే టీవీకే ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు రెండు, వీసీకే, ఐయూఎంఎల్‌లకు ఒక్కో మంత్రి పదవి దక్కగా.. కమ్యూనిస్టు పార్టీలు (సీపీఐ, సీపీఎం) ప్రభుత్వంలో చేరకుండా బయటి నుంచి మద్దతు ఇస్తున్నాయి.
    మరోవైపు, మిత్రపక్షాలు దూరం అవుతున్న తరుణంలో డీఎంకేలో కొత్త వాదన తెరపైకి వస్తోంది. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. డీఎంకే ఎంపీ కనిమొళి ఒంటరి పోరు ప్రతిపాదనను ముందుకు తేగా, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ ఎంపీ ఎ. రాజా కూడా దీనిని బహిరంగంగానే సమర్థించారు. ఇక వైకో రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. ఒకప్పుడు డీఎంకే దివంగత అధినేత కరుణానిధికి ముఖ్య అనుచరుడిగా, రాజకీయ శిష్యుడిగా ఉన్న ఆయన, 1993లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న వైకో.. డీఎంకేతో ఒకసారి కలవడం, మరోసారి విడిపోవడంగా రాజకీయాలు నెరపుతున్నారు. తాజా పరిణామంతో తొమ్మిదేళ్ల సుదీర్ఘ బంధానికి ఆయన మంగళం పాడారు.