తుమ్మిడిహెట్టికి పునర్వైభవం.
* కరెంట్ లేకుండానే ‘ప్రాణహిత’ పారాలి!.
* కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు వృథా.
* మోదీ గారూ.. మా ప్రాజెక్టును చూడండి.
* బీజేపీ నేతలకు మంత్రి జూపల్లి హితవు.
ఆదిలాబాద్, మహా.
ఉత్తర తెలంగాణ సాగునీటి కష్టాలను తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాణహిత నదికి మంత్రులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, గత పదేళ్లలో సాగునీటి రంగంలో జరిగిన విధ్వంసాన్ని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పట్ల జరిగిన అన్యాయాన్ని ఎండగట్టారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును నాటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 2008లోనే దార్శనికతతో ప్రారంభించారని గుర్తు చేశారు. సుమారు 38,500 కోట్ల అంచనా వ్యయంతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే మహత్కార్యంతో ఈ బ్యారేజీ పనులకు శ్రీకారం చుట్టారని వివరించారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గతంలోనే 106 కిలోమీటర్ల మేర కాలువల రూపకల్పన జరిగిందని, అందులో 71.5 కిలోమీటర్ల భూసేకరణ పూర్తి చేసి, 46 కిలోమీటర్ల మేర పనులు కూడా ముగిశాయని మంత్రి స్పష్టం చేశారు. అయితే, ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కనబెట్టి, కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు వృథా చేసిందని ధ్వజమెత్తారు. కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు రీ-డిజైనింగ్ చేసి ప్రజా ధనాన్ని సముద్రం పాలు చేశారని విమర్శించారు. నేడు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయి నీటిని వినియోగించుకునే పరిస్థితి లేదని, అదే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పూర్తయితే ఒక్క యూనిట్ కరెంటు అవసరం లేకుండా కేవలం గురుత్వాకర్షణ (గ్రావిటీ) ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించవచ్చని సాంకేతిక అంశాలను వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల రైతులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని జూపల్లి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలోనే చర్చలు జరుపుతామని, భూములు కోల్పోయే రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం వెనకాడదని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, బీజేపీ ప్రజాప్రతినిధులు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యతను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ‘వికసిత్ భారత్’ అని నినదించే కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రైతాంగం పట్ల పెద్ద మనసుతో వ్యవహరించి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో తుమ్మిడిహెట్టి కీలక పాత్ర పోషిస్తుందని, దీనిని పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు.








